CM Revanth Reddy Kodangal Tour : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal)లో నేడు పర్యటించనున్నారు. తొలిసారి అక్కడకు వెళ్లనున్న ఆయన, నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, సీహెచ్‌సీని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ సహా సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Kodangal Tour Today : ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తొలిసారిగా సీఎం రేవంత్ కొడంగల్ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభ(CM Revanth Reddy Sabha)కు వేలాదిగా హాజరుకానున్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 31,849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్ నుంచి గెలుపొంది, రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్నా, కొన్ని అత్యవసర కారణాలతో రెండుసార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి నిధుల సేకరణలో పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. ఇప్పటికే 'తెలంగాణ మాస్టర్ ప్లాన్ 2050' విజన్ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలను సీఎం ఇచ్చారు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకునే పనిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం