CM Revanth Reddy On Old City Metro Construction : హైదరాబాద్ పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా 2029 ఎన్నికల్లోగా పాతబస్తీ మెట్రో పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చాంద్రాయణగుట్టకు మెట్రో రైలులోనే వచ్చి ఓట్లు అడుగుతామని తెలిపారు. మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
పాతబస్తీకి మెట్రో రైలు వస్తుందంటూ కొన్నేళ్లుగా ఊరిస్తున్నారు కానీ రావడం లేదంటూ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. పాతబస్తీ అంటే ఓల్డు సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. జైపాల్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మెట్రోరైలు నిర్మాణానికి కృషి చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీకి మెట్రోరైలు అందుబాటులోకి రాలేదని, తాము అధికారంలోకి రాగానే శంకుస్థాపన చేసినట్లు సీఎం తెలిపారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు వివరించారు. సమాఖ్య విధానం మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం ప్రయత్నిస్తామన్నారు. అయితే కేంద్రం ఇవ్వనంత మాత్రాన అభివృద్ధి ఆగదని, రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు, పీపీపీ మోడల్లో చేసేందుకు ప్రైవేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్న ఆయన, స్థిరాస్తి సంస్థల భూముల ధరలు పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో ఏర్పాటు చేసినట్లు మండిపడ్డారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి ఎయిర్‌పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయని, మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మించనుందని వివరించారు.
ఇటీవల పార్లమెంటు ఎన్నికల సమయంలో తనపై, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పోలీసులు కేసు పెట్టారన్న అక్బరుద్దీన్, ఆ తర్వాత అమిత్ షాపై కేసును తొలగించి, తప్పు లేకపోయినా తనపై మాత్రం కొనసాగిస్తున్నారన్నారు. సీఎం పెద్దన్న సోదరుడు కాబట్టి అమిత్ షాపై కేసు తొలగించారని, పేద మిత్రుడిని కాబట్టి తనపై కొట్టివేయలేదన్న అక్బర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారు.
ప్రధాని మోదీని పెద్దన్న అని సంభోదించటంలో తప్పేముంది : అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని చెప్పారు. ఆ తర్వాత నిర్వాహకులపై ఛార్జిషీట్ వేసిన పోలీసులు, అమిత్ షాను తొలగించారని దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోందని చెప్పారు. ఎవరు అవునన్నా, కాదన్నా మోదీ దేశానికి ప్రధాని కాబట్టి రాష్ట్రాలన్నింటికీ పెద్దన్న వంటివారేనని సీఎం అన్నారు.
గుజరాత్, బిహార్‌లా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని, వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని బహిరంగంగా సభలో అడిగినట్లు వివరించారు. మోదీని పెద్దన్న అన్నది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప, రాజకీయ స్వప్రయోజనాల కోసం కాదన్నారు. మోదీని పొడిగితే తనకు వార్డు మెంబరు బీఫాం కూడా రాదని, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేల వల్లే తాను సీఎంగా ఉన్నానని సీఎం వ్యాఖ్యానించారు.