CM Revanth Reddy Focus on Telangana Cabinet Expansion : లోక్‌సభ ఎన్నికల అనంతరం పాలనపై పూర్తిగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముంది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ నెలఖారు లేదంటే జులై మొదటివారంలో విస్తరణ జరగవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం కాకుండా మరో 11 మంది మంత్రులు ఉన్నారు. సీనియర్ నాయకులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరడానికి వారికిచ్చిన హామీలను పరిగణిచండంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిథ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు స్థానమే దక్కలేదు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు చేరే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా మరో ఆరుమందిని మంత్రివర్గంలో చేర్పించుకునే అవకాశం ఉందని ప్రచారం. కాగా ప్రస్తుతం నలుగురిని మాత్రమే చేర్చుకునే అవకాశం ఉండొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వీరికే ఛాన్స్!
- లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిథ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణలో శ్రీహరికి ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం.
- గతంలో కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో చేరి తిరిగి హస్తం గూటికి వచ్చిన ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌ల పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నా, రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వహించడం లాంటివన్నీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు కేబినెట్‌లో చోటు లభించవచ్చేనే ప్రచారం జరుగుతోంది.
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం తెరపైకి వచ్చింది. పార్టీలో చేరే ముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా, వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. వివేక్ లేదా ప్రేమసాగర్‌రావులలో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఉండవచ్చు.
- ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేరు సైతం బాగా వినిపిస్తోంది. ఆయనకు సర్కారు ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించినా చోటు లభించలేదు.
- ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చు. ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉందని చర్చ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలోకి నలుగురి చేర్చుకోగా, రెండు స్థానాలు పెండింగ్‌లో పెట్టి కొంత సమయం తర్వార భర్తి చేసే అవకాశముంది.
మంత్రిమండలి విస్తరణ, ఇతర కీలక పదవుల ఎంపికపై కసరత్తు - దిల్లీ వెళ్లే యోచనలో సీఎం!
వ్యవసాయ రుణమాఫీయే ప్రధాన అజెండా - 21న తెలంగాణ కేబినెట్ సమావేశం - TS Cabinet Meeting 2024