CM Revanth Reddy About Former PM Dr Manmohan Singh : దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దివంగత మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి విశేషమైన సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని రేవంత్ రెడ్డి వివరించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని రేవంత్ వివరించారు. మన్మోహన్ సింగ్ ఎల్‌పీజీ(లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారని తెలిపారు. 2004-14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉపాధిహామీ, ఆర్టీఐ(సమాచారహక్కు చట్టం), ఎన్‌హెచ్‌ఆర్‌ఎంను ప్రారంభించారు. ఆర్థిక స్థితిగతులు మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి కొనియాడారు.
ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారు : సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్‌ను మన్మోహన్ ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీపడేలా పునాది వేశారన్నారు. ఆయన సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలని కోరారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తిని మన్మోహన్ సింగ్ సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్నా నిరాడంబరంగా జీవించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభించారన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తాం : 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఐటీ రంగంలో శాసించగలుగుతున్నామంటే మన్మోహన్ విధానాలే కారణన్నారు. ఆయన తెలంగాణకు ఆత్మబంధువని రేవంత్ అభివర్ణించారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చేయించిన సారథిని అని అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది: భట్టి విక్రమార్క : దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు, సామాజిక పరిస్థితి అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారని కొనియాడారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి అని భట్టి విక్రమార్క అన్నారు. చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారన్నారు. పాలనాపరమైన అంశాలను సామాన్యుడూ తెలుసుకునేలా 2005లో ఆర్టీఐ తెచ్చారని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కర్తకు తెలంగాణ సమాజం నివాళి - మన్మోహన్ సింగ్‌ను స్మరించుకున్న ప్రముఖులు
ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు- ఆర్థిక సంస్కర్తకు కన్నీటి వీడ్కోలు