CM Revanth Delhi Tour Updates : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈరోజు (సెప్టెంబరు 12వ తేదీ) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ వంటి పలు అంశాలపై చర్చించారు. వర్షాలు-వరదలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్లు తెలిసింది. మరోవైపు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని అమిత్ షాకు వివరించనున్నారు. రాష్ట్రంలో వరద నష్టం వివరాలను హోంమంత్రికి వివరించి కేంద్రం సాయం కోరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అమిత్ షాతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై వీరితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
CM Revanth Reddy On Kaushik Reddy Issue : మరోవైపు దిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని, అసెంబ్లీ చివరిరోజు బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించారని తెలిపారు. 38 మంది అని ప్రకటించినప్పుడు బీఆర్‌ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్ పీఏసీ ఛైర్మన్‌గా ఎలా ఉంటారు? అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ ఛైర్మన్ ఎలా ఇచ్చారు? అని సీఎం ప్రశ్నించారు. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా? అని అడిగారు. బతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. కౌశిక్‌రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనన్న ముఖ్యమంత్రి కోర్టుల నిర్ణయాలు తమకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు చేజారకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బలంగానే ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.