CM Revanth meet Foxconn : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం హస్తినకు వెళ్లనున్నారు. దిల్లీలో శుక్రవారం నాడు ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంటుందో ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులకు తెలియజేస్తారు.
పీఎంతో భేటీకి అపాయింట్‌మెంట్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లయితే పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన, అక్కడ వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం తదితర అంశాలను ప్రధానికి వివరిస్తారు. అలాగే రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణపై చర్చ : అనంతరం పార్టీ అధిష్ఠానంతో భేటీ అవనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని, వరంగల్ రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. దిల్లీలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
అయితే దిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ అప్పటి పరిస్థితులను బట్టి శుక్రవారం రాత్రికి హైదరాబాద్ రావడమా? లేక అక్కడే రెండు, మూడు రోజులు ఉండటమా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభిషేక్ సింఘ్విని నామినేషన్ కార్యక్రమం ఉండటం, 21వ తేదీలోపు నామినేషన్ వేయాల్సి ఉండటంతో సీఎంతో సంప్రదించిన తరువాత నామినేషన్ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ - పరవళ్లు తొక్కిన గోదారమ్మ - SITARAMA PROJECT LAUNCHED