CM Revanth Reddy Delhi Tour : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, ఇప్పటికే హస్తం పార్టీ 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో నలుగురు అభ్యర్థుల ఎంపికపై నేడు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరుగుతున్న సమావేశానికి, సోనియా గాంధీ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతానికి వరంగల్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ఖరారు చేశారు.
మరోవైపు కరీంనగర్, హైదరాబాద్‌లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థి ఎంపిక రాజకీయ కాక పుట్టిస్తోంది. అత్యంత హాట్ సీటుగా ఉన్న ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు హేమాహేమీలు పోటీ పడుతుండటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబీకులతో పాటు, పలువురు సీనియర్లు సైతం ఈ సీటుపై కన్నేశారు.
CONGRESS PARLIAMENT CANDIDATES 2024 : రాష్ట్రంలో ఇప్పటికే 14 స్థానాలకు, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. అలాగే నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసీసీ ఎంపిక చేసింది.
ఇక తొలి జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డితో కేకే మర్యాదపూర్వక భేటీ - ఇక చేరికే తరువాయి - K KESHAVA RAO MEETs CM REVANTH