CM Revanth Reddy Reacts On Shadnagar Dalit Woman Case : హైదరాబాద్ షాద్‌నగర్‌లో దళితమహిళపై పోలీసుల దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్‌ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ పీసీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్ జులై 24న తన ఇంట్లో 22.5 తులాల బంగారం, 2 లక్షలు పోయాయని ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జులై 26న డీఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్ పిలిచారు. చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు.
అయితే, మళ్లీ 30న రాత్రి 9 గంటలకు సునీత ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు నేరం అంగీకరించాలని చిత్రహింసలకు గురిచేశారని చెబుతోంది. ఒప్పుకోకపోవడంతో ఆమె కళ్ల ముందే 13 ఏళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఫిర్యాదుదారు వాహనంలోనే ఇంటికి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఘటనపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్ మానవ హక్కుల రక్షణలో విఫలమైందని ధ్వజమెత్తారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికీ తీవ్రమవుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దళిత మహిళపై అమానుష ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"దొంగతనం పేరుతో తొలుత నా భర్తను కొట్టారు. తర్వాత నన్ను తీసుకొని వెళ్లి, చిన్న దుస్తులు తొడిగించారు. చేతులు వెనక్కి కట్టి, నానా అవస్థలు పెట్టారు. కాళ్లు చాపి ఘోరాతిఘోరంగా కొట్టారు. గొంతు ఎండి, ప్రాణం ఆగమైపోతుందని వేడుకున్నా, మహిళనని కూడా చూడకుండా, చేయని తప్పునకు చిత్రహింసలు పెట్టారు." - బాధితురాలు
షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది. దళిత మహిళపై దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దళిత మహిళపై దాడి ఘటనపై షాద్‌నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఖాకీల కర్కశత్వం - దొంగతనం ఆరోపణలతో ఎస్సీ మహిళపై విచక్షణరహితంగా దాడి - Police Crushed Accused Woman