CM Revanth Will Release Third Phase Runa Mafi : ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర రుణాల వరకు రేవంత్ రెడ్డి సర్కారు మాఫీ చేసింది. నేడు మూడో విడతగా లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాల మాఫీని సీఎం ప్రకటించనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం మాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రూ.2లక్షల లోపు రుణం కలిగిన రైతులకు : రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. లక్ష వరకు రుణం ఉన్న 1114412 మంది రైతులకు జులై 18న రూ.6034 కోట్లు విడుదల చేసింది. లక్ష నుంచి లక్షన్నరలోపు రుణాలున్న 6లక్షల40వేల823 మంది రైతుల ఖాతాల్లో జులై 30న 6190 కోట్లు జమ చేసింది. లక్షన్నర నుంచి 2 లక్షల లోపు రుణం కలిగిన రైతులకు నేడు మాఫీ ప్రక్రియ పూర్తి చేయనుంది.
వైరా బహిరంగ సభలో ప్రకటించనున్న సీఎం : మూడో విడత లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని నేడు సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా పూర్తి చెయ్యనున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న బహిరంగసభలో సీఎం రుణమాఫీ ప్రకటిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేల మందికి పైగా జనసమీకరణ చేస్తుండగా సభను రైతు పండుగలా నిర్వహిస్తున్నారు.
సభా ప్రాంగణం చుట్టూ మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. చెరకు, పామాయిల్ మొక్కలను ప్రాంగణంలో ఉంచారు. వేదికపై ముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గం, ఇతర ముఖ్యులు కలిపి 200 మంది వరకు కూర్చునేలా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకుంటారు. అనంతరం పూసుగూడెం పంపుహౌస్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్‌లో సీఎం వైరాకు చేరుకుని రుణమాఫీ బహిరంగ సభలో పాల్గొని మూడోవిడత రుణమాఫీ చెక్కులను అందించనున్నారు.
పంప్‌హౌస్‌లు ప్రారంభించనున్న సీఎం : ఉమ్మడి ఖమ్మంజిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాల్లోని 9లక్షల 20వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. మూడు పంప్ హౌస్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి కాగా ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, కమలాపుర్ పంప్‌హౌస్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు తొలిపంప్ హౌస్‌ను జిల్లా ఇంఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభిస్తారు. గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడికి చేరుస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్టయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కౌలు రైతుల అప్పులు కూడా మాఫీ చేయాలని విజ్ఞప్తులు అందుతున్నాయి.
ఆగస్టు 15నే రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తాం: మంత్రి ఉత్తమ్ - Sitarama lift irrigation scheme
అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని వారి నుంచి 72 వేలకు పైగా ఫిర్యాదులు'