CM Revanth Clarity On Rythu Bharosa : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికుబురు అందించింది. సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులు జమచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి, సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను అని వెల్లడించారు.
తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్షలాది మంది రైతులు శనివారం మహబూబ్‌నగర్ రైతు పండుగలో పాల్గొన్నారన్న ఆయన, మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగిందన్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులపై.. ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెలరోజులకే రూ.7,625 కోట్ల రైతుబంధు నిధులు చెల్లించామని సీఎం వెల్లడించారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి.. నేటివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్‌రెడ్డి తెలిపారు.
"రూ.2 లక్షల వరకు ఉన్న అందరికీ రుణమాఫీ పూర్తయ్యింది. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేశాం. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతాం. ఖాతాల్లో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుంది. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశాం. మొదట్లో బ్యాంకు అధికారులు రుణమాఫీపై సరైన సమాచారం ఇవ్వలేదు. బ్యాంకుల్లోని మొత్తం పాతబకాయిలు కలిపి రూ.30 వేల కోట్లుగా లెక్క చెప్పారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కించుకోవాలి : సీఎం రేవంత్ ఆదేశం
రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి