CM Relief Fund Scam in Telangana : సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish rao) వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తితో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో హరీశ్‌రావు క్యాంప్ ఆఫీసులో అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నరేశ్ కుమార్, కొర్లపాటి వంశీ, వెంకటేష్‌గౌడ్, ఓంకార్‌లను అరెస్ట్ చేశారు.
మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవి నాయక్ భార్య లలితా 2022లో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది. ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో రూ.5 లక్షలు బిల్లు కావడంతో 2023లో రవి సీఎంఆర్‌ఎఫ్‌కు(CMRF) దరఖాస్తు చేసుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల సచివాలయానికి వచ్చి అతను ఆరా తీశాడు. అయితే రెండు చెక్కుల ద్వారా రూ.87,500 వచ్చినట్లు అధికారులు రవి నాయక్‌కు చెప్పారు.
తన విజ్ఞప్తికి స్పందన రాక ఇబ్బందులు పడుతుంటే, తన పేరు మీద అప్పటికే ఎవరో చెక్కు తీసుకుని డబ్బు డ్రా చేశారన్న విషయం తెలిసి ఏదో గందరగోళం జరిగిందని రవి భావించాడు. ఈ క్రమంలోనే ఆరా తీయగా గతంలో మంత్రి హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన నరేశ్, ఓంకార్ సాయంతో జూబ్లీహిల్స్ రోడ్ నం.5లో చెక్కులు డ్రా చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21వ తేదీన జూబ్లీహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Harishrao Office Reacts on CMRF Scam : సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ వ్యవహారంలో మాజీమంత్రి హరీశ్‌రావు కార్యాలయం స్పందించింది. హరీశ్‌రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేశాడు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. నరేశ్ అనే వ్యక్తి హరీశ్‌రావు వద్ద పీఏ కాదని, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా కార్యాలయంలో పనిచేశారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్యమంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబర్ 6న కార్యాలయం మూసివేసి సిబ్బందిని పంపించేశామని తెలిపారు.
ఈ క్రమంలో సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేశ్ తన వెంట తీసుకువెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే స్పందించి, నరేశ్ అనే వ్యక్తిపై డిసెంబర్ 17న నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. చట్టప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోందని. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరమన్నారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. భారీ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు స్వాహా