CM Chandrababu On TTD Declaration : తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమైందని, ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమని తెలిపారు.
ఏడు కొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు స్పష్టంచేశారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారని ఆయన అన్నారు. ఈనేపథ్యంలో భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని వెల్లడించారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.
బోర్డుల ఏర్పాటు : మాజీసీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరాల్సి ఉన్న జగన్, తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయించుకున్నారు. మరోవైపు అన్యమతస్థుల శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ తిరుమలలో టీటీడీ బోర్డులను ఏర్పాటు చేసింది. దర్శనానికి వెళ్లాలంటే తప్పక పాటించాల్సిన, అనుసరించాల్సిన విధానాలను వాటిలో పేర్కొంది.
బోర్డులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. ఎండోమెంట్ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఫారాలు అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్, అన్ని ఉప విచారణాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని బోర్డుల ద్వారా తెలియజేశారు.
తిరుమల లడ్డూ వివాదం - యాదాద్రి ప్రసాదంపై అధికారుల కీలక నిర్ణయం - YADADRI LADDU QUALITY TEST IN HYD