CM Chandrababu Started Distribution of Pensions : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రాంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేశారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేస్తున్నారు. పెరిగిన పింఛను 4వేల రూపాయలతో పాటు గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి మొత్తం 7వేల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
Pensions Increased in AP : వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్ వంటి వారికి ఇకపై 4వేల రూపాయల పింఛను అందనుంది. దివ్యాంగులకు రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలు చేయగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ. 5 వేలు నుంచి రూ.15వేలు చేస్తూ నిర్ణయం చేశారు. ఈ విభాగంలో 24318 మంది పింఛను అదనంగా పొందనున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి రూ.7వేలు చొప్పున ఫించన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదరిక నిర్మూలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. సంపద సృష్టించి, పేదలకు పంచుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలతో కాలం గడపబోమని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పని చేస్తామని వివరించారు. తన చేతుల మీదుగా పింఛను అందించిన రాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా పింఛన్ అందుకోవడం సంతోషం ఉందని లబ్ధిదారులు తెలిపారు.
"పింఛన్లు తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజా ప్రభుత్వం ఉంది. నిరంతరం మీకోసం పని చేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజానికి శ్రీకారం చుట్టాం. గతంలో ప్రజల బతుకులను రివర్స్ చేశారు. కోలుకుని మళ్లీ ముందుకెళ్లాలి. అందరూ సమష్టిగా కలిసి పని చేద్దాం. సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం, పెంచిన ఆదాయం పంచుతాం." - సీఎం చంద్రబాబు