Free Bus Scheme in Andhra Pradesh : ఉగాది పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఈ ఉచిత బస్సు విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఫీల్డ్ విజిట్స్ త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందచేయాలని సీఎం కోరారు. ఉగాది నాటికి పథకాన్ని అమలు చేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రాబాబు ఆదేశాలు జారీ చేశారు.