Children won Gold Medal in National Kickboxing : సంగారెడ్డిలో 2001 నుంచి కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి కోచ్, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు పోచయ్య "వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా" పేరుతో కిక్ బాక్సింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి 26 వరకు మహారాష్ట్ర, పూణేలో నిర్వహించిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2024 పోటీల్లో మెుత్తం జిల్లా నుంచి ఆరుగురు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు బంగారు పతకాలు సాధించగా మరో ఇద్దరు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
మెత్తం ఈ పోటీల్లో దేశంలోని 27 రాష్ట్రాలు పోటి పడగా అండర్-10 విభాగంలో భవజ్ఞ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్-13 విభాగంలో శిఖరదీప్, రఘువంశీలు గోల్డ్ మెడల్ సాధించారు. తమ చిన్నారులు చిన్ననాటి నుంచి ఇలాంటి స్వయం రక్షణ కలిగిన విద్యను నేర్చుకోవడంతో పాటు పతకాలు సాధించడం ఏంతో సంతోషంగా ఉందని వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోటీలు ఉంటే ఉదయం నుంచి శిక్షణ తీసుకుంటు మంచి పట్టుదలతో తలబడతారని చెబుతున్నారు. తమ పిల్లలు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రంతో పాటు దేశానికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'మేము గత మూడేళ్ల నుంచి కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు చాలా టోర్నమెంట్లో ఆడాం. పుణెలో జరిగిన పోటీలో మాకు గోల్డ్ మెడల్ వచ్చాయి. బంగారు పతకం కోసం ప్రతిరోజు సాధన చేశాం' - విద్యార్థులు
రానున్న రోజుల్లో ఒలంపిక్స్‌లో సత్తా చాటే విధంగా శిక్షణ : శిక్షకుడు పోచయ్య అంతర్జాతీయ స్థాయిలో పోటిపడి బంగారు సాధించి దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులను తయారు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఒలంపిక్స్‌లో కూడా తమ విద్యార్థులు సత్తా చాటే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తమ అకాడమీ నుంచి ఇప్పటికే దాదాపు 100 మంది శిక్షకులను తయారు చేశామన్నారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు ఆటల్లో పాల్గొని బంగారు పతకాలు సాధిస్తున్న ఈ చిచ్చర పిడుగులు ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
'2001 నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్‌లో చాలా మంది విద్యార్థులకు నేర్పించాను. వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున 10 వేల మందికి పైగా బెల్ట్ గ్రేడింగ్ చేశాను. బ్లాక్ బెల్ట్ వాళ్లు దాదాపు 128 మంది ఉన్నారు. ఇప్పుడు 14 సార్లు జాతీయ స్థాయిలో కిక్‌బాక్సింగ్ ఆడారు. వీరిలో చాలామంది గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ మెడల్స్ తీసుకొచ్చారు'-పోచయ్య, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు
YUVA : బాస్కెట్ బాల్ క్రీడే లక్ష్యంగా యువత సాధన - Summer camp Basket Ball Training