Child Trafficking Gang Arrested in Hyderabad : మాఫియా తరహా ఎత్తులతో సాధారణ ముఠాలు సైతం నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాగే, హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన చిన్నారులు విక్రయం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 11 మందిని అరెస్టు చేయగా పరారీలోని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లల్ని విక్రయించేందుకు ఎమ్, ఎఫ్ పేరుతో ప్రత్యేకంగా కోడ్‌భాషలో సందేశాలు పంపేవారు. దీనికి అనుగుణంగా ప్రధాన నిందితులు దిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య చిన్నారుల్ని పంపిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలు తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో రాత్రి పూట అందిస్తున్నారు. నగదు లేదా ఆన్‌లైన్ ద్వారా డబ్బు తీసుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది.
ఇప్పటివరకు అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో 8 మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు. వారి నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించారు. విజయవాడకు చెందిన నిందితులు బలగం సరోజ, ముదావత్ శారద, పఠాన్ ముంతాజ్, జగన్నాథం, అనురాధతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ, పుణె, దిల్లీలోని నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల్ని కొనుగోలు చేసి పెంచుకుంటున్న 13 మందిపైనా కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబయి పోలీసులు రాచకొండ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కేసు వివరాలపై ఆరా తీసి వారి దగ్గర రికార్డులతో సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
సంతాన సాఫల్య కేంద్రాలే అడ్డాగా : నిందితుల్లో కొందరు ఐదేళ్లుగా చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడకు చెందిన ముదావత్ శారద కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఈమెపై చిన్నారుల విక్రయానికి సంబంధించి మూడు కేసులున్నాయి. ముంబయిలోని కంజుమార్గ్ పోలీస్ స్టేషన్‌లోనూ ఇటీవలే కేసు నమోదైంది. అంటే నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాట కలిపి తమకు తెలిసినవారి దగ్గర నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతారు. అవసరమైతే కొన్నిసార్లు ఫొటోలు చూపించి మరీ విక్రయిస్తున్నారు. డబ్బిచ్చిన రెండు, మూడు రోజుల్లో చిన్నారుల్ని వారి చేతుల్లో పెట్టేలా వ్యవస్థను నడిపిస్తున్నారు.
శిశువులను విక్రయించడానికి బాండ్ల ఒప్పందం : దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 60 మంది చిన్నారుల్ని దిల్లీ, పుణె నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది. మేడిపల్లి పోలీసులు 16 మంది చిన్నారుల్ని రక్షించగా మిగిలిన 44 మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టిసారించారు. సాంకేతిక ఆధారాలు, నిందితుల ఫోన్లలోని సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకునేవారు. ఈ బాండ్ల పేపర్ల తతంగంపైనా పోలీసులు దృష్టిపెట్టారు.
Parents Sold Infant Boy: పోషించే స్థోమత లేదని శిశువును అమ్మిన తల్లిదండ్రులు.