పాఠశాల గేటుకు తాళం వేస్తుండగా కూలిన ప్రహరీ - చిన్నారి మృతి, మరో ఇద్దరికి గాయాలు - DEATH OF CHILD
పాఠశాల గోడ కూలి ఏడేళ్ల చిన్నారి మృతి - ఒక్కసారిగా గోడ శిథిలాలు మీద పడటంతో సంభవించిన ప్రమాదం
Published : Dec 5, 2024, 12:56 PM IST
Child Death in School : మనం రోజూ తెలిసిన వారికి ఏదైనా అవసరమున్నప్పుడు తోచినంత సహాయ, సహకారాలు అందిస్తుంటాం. అలా చేయడం వల్లే అప్పుడప్పుడు తెలియకుండానే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఊహ తెలియని చిన్నారులు స్వచ్ఛమైన మనసుతో సహాయం చేయడానికి వెళితే, ఏకంగా వారి ప్రాణాల మీదకే వచ్చింది.
ప్రభుత్వ పాఠశాల గోడ కూలి రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి అస్తమాహిన్ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో బుధవారం (డిసెంబర్ 4) చోటుచేసుకుంది. నందికొట్కూరు పట్టణానికి చెందిన షాలు బాషా, రుక్సానా దంపతుల కుమార్తె అస్తమాహిన్. స్థానిక విద్యానగర్ కాలనీలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అస్తమాహిన్‌తో పాటు మరో 12 మంది ఇక్కడే చదువుతున్నారు. బుధవారం పాఠశాల సమయం అయిపోయిన తర్వాత పాఠశాలలో పని చేసే ఆయా నూర్జహాన్ గేటుకు తాళం వేసేందుకు ప్రయత్నించారు.
చిన్నారి ప్రాణం తీసిన గేటు : ప్రహరీ శిథిలావస్థకు చేరడంతో కొంతకాలంగా గేటు సరిగా పడటం లేదు. దీంతో అది చూసిన రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు తబసుం, అజీద్ ఆయాకు కొంత సాయంగా వెళ్లారు. పిల్లలతో కలిసి ఆయా గేటును బలంగా చేతులతో నెట్టారు. దీంతో ఒక్కసారిగా గేటు, ప్రహరీ కూలిపోయాయి. ఆ సమయంలో ప్రహరీకి ఆనుకొని నిల్చున్న అస్తమాహిన్‌పై గోడ శిథిలాలు పడిపోయాయి. తబసుం, అజీద్‌లపై గేటు పడింది. ఈ ఘటనతో చిన్నారులు పెద్ద పెద్ద కేకలు వేయడంతో పాఠశాల ఉపాధ్యాయురాలు, సమీపంలోని వారు పరుగెత్తుకొని వచ్చి పిల్లలపై పడిన గేటు, శిథిలాలను వేగంగా తొలగించారు.
స్వల్పంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అస్తమాహిన్ తలపై నాపరాయి గట్టిగా పడటంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె మృతి చెందిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రహరీ గోడ శిథిలావస్థకు వచ్చిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు పట్టించుకొని పాఠశాల చుట్టూ గోడకు మరమ్మతులు చేసి ఉంటే, ఈరోజు చిన్నారి ప్రాణం పోయుండేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.