Consumer Court on Kolors : ఊబకాయం, శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిస్తామంటూ పలు క్లినిక్‌లు అమాయకులను మోసం చేస్తున్నాయని, ఈ తరహా చికిత్స అందించే క్లినిక్‌లు నిబంధనల మేరకు నడుస్తున్నాయో లేదో నివేదిక అందించాలని హైదరాబాద్ డీఎంహెచ్‌వో, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. మార్చి 17వ తేదీలోపు నివేదిక అందించాలంది.
అసలేం జరిగిందంటే? : సంగారెడ్డికి చెందిన యువతి మియాపూర్‌లోని కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బరువు తగ్గడానికి చికిత్స తీసుకుంది. రూ.1.05 లక్షలు చెల్లించిన యువతికి చికిత్స తీరు నచ్చకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కలర్స్ హెల్త్ కేర్ ప్రతినిధులను కోరింది. దీనికి ప్రతినిధులు నిరాకరించడంతో సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణను చేపట్టిన జిల్లా వినియోగదారుల కమిషన్ యువతికి 9 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి చెల్లించాలని, మానసికంగా ఇబ్బంది కలిగించినందుకు రూ.50 వేలు జరిమానా విధించింది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అదనంగా మరో 3 శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు అప్పీలు : అయితే జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేశారు. చికిత్స తీసుకున్న యువతి తగిన సూచనలు పాటించలేదని, ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే బరువు తగ్గలేదని కమిషన్‌కు అందించిన వివరాల్లో పేర్కొన్నారు. దీనికి బాధిత యువతి సమాధానం ఇస్తూ అర్హత లేని వాళ్లతో కలర్స్ హెల్త్‌కేర్ వాళ్లు చికిత్స చేయిస్తున్నారని కమిషన్‌కు తెలిపింది.
అప్పీలు కొట్టివేత : ఇరువైపులా వాదనలు విన్న రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కలర్స్ హెల్త్‌కేర్ సమర్పించిన అనుమతి పత్రాలు కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం చెల్లవని తేల్చి చెప్పింది. నిపుణులైన వైద్యులు, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఊబకాయం లాంటి కఠినమైన చికిత్సలను ఎలా అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కలర్స్ హెల్త్ కేర్ దాఖలు చేసిన అప్పీలును రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కొట్టేసింది.