Chandrababu Naidu Tribute to NTR : రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటే అభివృద్ధి : సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు సూచించారు.
నారా లోకేశ్ నివాళులు : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని తాతయ్య నందమూరి తారక రామారావు గారే తన నిత్యస్ఫూర్తి అని పేర్కొన్నారు.
అంజలి ఘటించిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.
ఈ రికార్డ్ ఎన్టీఆర్‌కే సాధ్యం? - అంతమంది దర్శకులతో పనిచేశారా? - NTR 101 Birth Anniversary