Heavy rains in 11 districts tomorrow : రాష్ట్రంలో రేపు 11జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు భారీ వర్షాలుంటాయని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో టెలీ కాన్ఫరెన్స్‌లో పాటు డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపక సర్వీసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌లు పాల్గొన్నారు.
భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున, రానున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని... పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలని సూచించారు.
స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్ కు 31 మంది సభ్యులతో కూడిన నాలుగు బోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపుతున్నట్లు సీఎస్ తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఈ నీటి పరిమాణం ఎక్కువైతే నేడే పరీవాహక ప్రాంతాల్లో తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటి కప్పుడు అంచనా వేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధిత అధికారులతో జాయింట్ టీమ్ లను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలన్నారు.
హైదారాబాద్ నుంచి ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్న తమను సంప్రదించాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ లలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేసేలా చూడాలన్నారు. రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్.పీ లు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి డీజీపీ జితేందర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్‌లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి డీజీపీ సూచించారు.
Telangana Heavy Rains Expected by September 5 : మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం తాజాగా వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాజస్థాన్ లోని జైసల్మెర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకూ రుతుపవన ద్రోణి ఏర్పడింది.