New Biweekly Train From Hyderabad to Goa : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటి వరకు వారానికి ఒకరైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్‌కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది.
ఇది కాకుండా కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో ప్రధాని, రైల్వే శాఖమంత్రులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.
సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చిలో లేఖ రాశారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణంకానుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుందని తెలిపింది.