CAG Report on Hyderabad Metro Rail : హైదరాబాద్లో ప్రయాణికుల రవాణా అవసరాలను తీర్చేందుకు నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణంలో సర్కారు తీరును కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి నివేదికను వెల్లడించిన కాగ్, ఆడిట్ నివేదికలో మెట్రో రైలుపై కీలక విషయాలను వెల్లడించింది. మెట్రో కారిడార్లో జాప్యం, భూమి, ఆస్తుల సేకరణలో జాప్యం కారణంగా ప్రాజెక్టు కార్యకలాపాల్లో ఆలస్యమైందని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరగడానికి దారితీసినట్లు స్పష్టం చేసింది. మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలను ఒప్పందం మేరకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ(L&T Metro Rail) అభివృద్ధి చేయలేదని నివేదికలో పేర్కొంది.
ఫలితంగా సదరు సంస్థ 227.19 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొందిందని కాగ్ వెల్లడించింది. ప్రయాణికుల ఛార్జీలు తొలుత ఒప్పందం ప్రకారం కాకుండా అధిక ఛార్జీలను నిర్ణయించడం ద్వారా 2017 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు రూ. 213.77 కోట్లను ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసినట్లు ఆడిట్ గమనించింది. కాస్టింగ్ యార్డ్ల అద్దెల దగ్గర నుంచి పలు అంశాల్లో సదరు సంస్థకు లబ్ది చేకూరేలా సర్కారు నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. మెట్రోరైలుకు కేటాయించిన భూముల్లో అభివృద్ధి చేసిన మాల్స్, కార్యాలయాలను మెట్రో రైలు ప్రారంభం అయ్యాకే అద్దెకు ఇవ్వాలనేది ఒప్పందం. కానీ మెట్రోరైలు సేవలు ప్రారంభం కంటే ముందే వాటిని లీజుకు ఇచ్చారు. దీంతో సదరు సంస్థకు లాభం చేకూరింది.
మెట్రో రైలు కారిడార్-2ని జేబీఎస్(JBS) నుంచి ఫలక్నుమా వరకు 5.2 కిలోమీటర్లు భూసేకరణలో సమస్యలు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత కారణంగా అసంపూర్తిగా ఉంది. 21 ఎకరాల డిపో కోసం ఫలక్నుమా వద్ద భూమి కేటాయించినప్పటికి వినియోగించుకోలేకపోయారని తెలిపింది. మొత్తంగా ప్రాజెక్టు అసంపూర్తి కారణంగా వ్యయం పెరగడమే కాకుండా ఆశించిన ప్రయాణికుల సంఖ్యను చేరలేకపోయింది. అవాస్తవిక ప్రయాణికుల సంఖ్య అంచనాలను ఒప్పందంలో చేర్చడాన్ని కాగ్ తప్పుపట్టింది. ప్రయాణికుల సంఖ్యను అంచనా వేసేందుకు వివిధ సమయాలను, లక్ష్యాలను ఒప్పందంలో సూచించలేదు. ఫలితంగా ఒప్పందాన్ని 35 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించేందుకు దారి తీస్తుందని హెచ్చరించింది.
CAG on L&T Metro Rail Charges : పలు చోట్ల స్టేషన్లను ఆస్తుల సేకరణ సమస్యలతో ఒప్పందంలో పేర్కొన్నట్లు కాకుండా తక్కువ విస్తీర్ణంలో నిర్మాణ సంస్థ చేపట్టింది. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. కానీ తగ్గినట్లు ఎక్కడా చూపలేదు. ఫలితంగా ఎల్ అండ్ టీ మెట్రోకు రూ. 227.19 కోట్ల మేర అనుచిత లబ్ది చేకూరింది. రాయితీ ఒప్పందం ప్రకారం ఎక్కువ ఛార్జీలను నిర్ణయించడం నిబంధనల ఉల్లంఘనేనని కాగ్ అభిప్రాయపడింది. అధిక ఛార్జీలను నిర్ణయించడం వల్ల 2017 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు మెట్రో రైలు సంస్థ 213.77 కోట్లను అధికంగా వసూలు చేసినట్లు తేల్చింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు వ్యయ నిధి 253.80 కోట్ల రూపాయలను విడుదల చేయలేదని నివేదికలో పేర్కొంది.
పట్టణ పునరుద్దరణ పనులు, ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల తేదీ కన్నా ముందే ప్రాజెక్టు ఆస్తులను సబ్ లీజుకు ఇవ్వడంలో ఒప్పంద నిబంధనలను కంపెనీ అమలు చేయలేకపోయినట్లు పేర్కొంది. రాయితీదారుడికి కౌలుకు ఇచ్చిన భూములపై న్యాయమైన అద్దెను కంపెనీ రాబట్టుకోలేకపోయిందని, పరిపాలన ఖర్చులను మాఫీ చేసినట్లు నివేదించింది. రూ.11.68 కోట్ల వ్యయంతో నిర్మించిన పుత్లిబౌలి వాణిజ్య సముదాయాన్ని కూడా అయిదేళ్ల పాటు సమర్థవంతంగా వినియోగించలేకపోయిందని తెలిపింది. అలాగే రాయదుర్గం మెట్రో స్టేషన్కు దూరంగా పార్కింగ్ కోసం భూమి కేటాయింపుతో ప్రయోజనం నెరవేరలేదని, కేటాయించిన భూముల ద్వారా అదనపు ఆదాయం పొందలేకపోయిందని స్పష్టం చేసింది.
CAG on Metro Rail Parking Place : మరో 42 స్టేషన్లలో కూడా ఎలాంటి పార్కింగ్ సదుపాయం లేదని తేల్చింది. మెట్రోరైలు ప్రాజెక్టులో తప్పులను ఎత్తిచూపడమే కాకుండా కాగ్ తన నివేదికలో ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు కూడా చేసింది.
- కారిడార్-2 పాతబస్తీ మార్గాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి.
- లేదంటే కారిడార్-2లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండిపోతుంది.
- స్టేషన్ నిర్మాణంలో అనధికార ఉల్లంఘనలకు అనుమతించిన అధికారులపై చర్యలు
- ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు సరిపడా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుకు చర్యలు
- త్వరగా ప్రభుత్వం ఛార్జీల నిర్ణయ కమిటీ ఏర్పాటు
- ఎల్ అండ్ టీ నుంచి బకాయిలు వసూలుకు ప్రణాళిక
ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్ రిపోర్టు