Harish Rao Visit to Injured Home Guard : సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్‌ను ఇప్పటి వరకు పోలీస్ అధికారులెవ్వరూ పరామర్శించలేదని, ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా అతన్ని ఎందుకు పరామర్శించలేదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. హోంగార్డ్లు అంటే అధికారులకు చులకనగా ఉందన్నారు.
విధి నిర్వాహణలో గాయపడిన గోపాల్‌కు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు హోంగార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని గోపాల్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి జీతం రాక, ఇటు వైద్య ఖర్చులు భరించలేక పోతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.
గోపాల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం : ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు జరిపినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగానే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారని, అధికారులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. గోపాల్‌కు పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, అతనికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.
ఇంతకీ ఏమి జరిగిందంటే : రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతల పర్వం జోరుగా కొనసాగుతూ హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బిల్డింగ్‌ను బ్లాస్టింగ్ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు ఎగిరిపడి హోంగార్డు గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించిన విషయం తెలిసిందే.