BRS Protest on Kavitha Arrest : దిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును (Kavitha Arrest) నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పలుచోట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అంబర్‌పేట, మేడ్చల్, మియాపూర్, జూబ్లీహిల్స్‌లో రోడ్డుపై బైఠాయించి, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లాలో రోడ్డుపైకి వచ్చి కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
Kavitha Arrest in Delhi Liqour Case : కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్‌లో జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళ నాయకులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనబాట పట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీచేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్విచక్రవాహన ర్యాలీచేసి రాస్తారోకో నిర్వహించారు.
నిజామాబాద్ ఎన్టీఆర్ ధర్నాచౌక్‌లో బీఆర్ఎస్(BRS) నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బైఠాయించి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి ,జనగామ జిల్లాల్లో నల్లబ్యాడ్జిలతో రాస్తారోకో నిర్వహించారు.
రాజకీయ కుట్రపూరితంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకి నిరసనగా కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ శ్రేణులు నల్లజెండాలతో ధర్నా చేశారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - 7 రోజుల ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌తో కలిసి ప్రధాన రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన నిర్వహించారు. రహదారిపై బైఠాయించి ఈడీ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుపై రాస్తారోకో చేపట్టగా, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో గులాబీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి ఈడీ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం