BRS MP Candidates 2024 : లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా ఎంపీ సీట్ల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తి చేసిన బీఆర్ఎస్ శనివారం నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. వచ్చే నెల పదో తేదీ లోపు ఈ సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఎంపికపై కూడా బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా జిల్లాల నేతలతో పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీకి సిద్ధమవుతుండగా, వారిలో కొంత మందికి ఇప్పటికే మార్గం సుగమం అయ్యింది. మరికొందరిని కూడా పని చేసుకోవాలని నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి - గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధుల కోసం వేట
బీఆర్ఎస్కు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి అంత సుముఖంగా లేరన్న ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు అడుగుతున్నారు. గతంలో అవకాశాలు రాని వారితోపాటు ఇటీవలి ఓటమి పాలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీలో లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు చాలా మంది ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
గత లోక్‌సభ ఎన్నికల తరహాలో తమకు కూడా సానుభూతి కలిసి వస్తుందేమోనన్న ఆలోచన కొందరు నేతల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని స్థానాల్లో కొత్త వారికి అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఒకట్రెండు చోట్ల అభ్యర్థులకు సంబంధించి స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వం మంతనాలు జరుపుతోంది. ఆయా నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం - వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు
KCR Contest in Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానన్న ప్రచారాన్ని కేటీఆర్ తోసిపుచ్చారు. అలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రస్తుతం చర్చించ లేదని వ్యాఖ్యానించారు. వీలైనంత మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు కావాలని ఉపఎన్నికలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అన్న భావన ఉందని సమాచారం. తప్పనిసరి పరిస్థితి అయితేనే ఆ తరహా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తై త్వరలోనే అభ్యర్థిత్వాలు ఓ కొలిక్కి రానున్నాయి.
'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్‌తో దూసుకొస్తుంది : కేటీఆర్