BRS leaders To Meet Governor Today : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్న బీఆర్ఎస్, అందుకు తగ్గట్లుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను అనర్హులుగా పరిగణించాలంటూ గత కొంత కాలంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతికి ఫిర్యాదు చేసింది. హైకోర్టు కోర్టు తలుపులను తట్టింది. తాజాగా నేడు గవర్నర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మధ్యాహ్నం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలవనుంది. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, శాసనసభ్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించనున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు కూడా పార్టీ సిద్ధమవుతోంది.
ఇవాళ మధ్యాహ్నం గవర్నర్‌ను కూడా కలిసి ఫిరాయింపుల అంశాన్ని ఆయనకు వివరించనున్నారు. నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటితో పాటు ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీఆర్ఎస్ నేతల బృందం కలవడం ఇదే మొదటిసారి. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చొన్న తర్వాత పార్టీ నేతలు గవర్నర్ ను కలవలేదు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తర్వాత ఇన్‌ఛార్జ్ గవర్నర్గా వచ్చిన సీపీ రాధాకృష్ణన్ ను బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు కలవలేదు.
స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లోకి వస్తున్నారు: బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, బీఆర్ఎస్ నామమాత్రంగా మిగిలిపోతుందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అహంకారంతో మాట్లాడిన బీఆర్ఎస్ నేడు పేకమేడల్లా కూలిపోతుందన్నారు. రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కరీంనగర్‌లో పర్యటించిన మంత్రులు ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పడానికి నీతి ఆయోగ్ నివేదిక నిదర్శనం : కేటీఆర్