BRS MLA Joins Congress : శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే నేతలు పార్టీని వీడటం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం కూడా గెల్చుకోకపోవడం మరింత ఇక్కట్లలోకి నెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలకు గాలం వేస్తూ వచ్చిన అధికార కాంగ్రెస్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింతగా పదునుపెట్టింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు బీఆర్ఎస్ శాసనసభ్యులు పార్టీని వీడగా, ఎన్నికల తర్వాత ఏకంగా ఐదుగురు గుడ్ బై చెప్పారు. పార్టీని వదిలి వెళ్లిన శాసనభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది గెలవగా, కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత దుర్మరణంతో ఆ సంఖ్య 38కి చేరింది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో శాసనసభలో ఆ పార్టీ బలం 30కి పడిపోయింది.
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం : ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ను వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనసభ, మండలి రెండుచోట్లా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే చేరికలపై హస్తం పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు పార్టీని వదిలిపెట్టి వెళ్లకుండా బీఆర్ఎస్ అధినాయకత్వం అన్ని రకాల యత్నాలు చేస్తోంది. అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు.
పార్టీని వీడవద్దని వారికి బుజ్జగింపులు : పార్టీని వీడకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, ప్రజలే మళ్లీ బీఆర్ఎస్ను వెతుక్కుంటూ వచ్చి అధికారం అప్పగిస్తారని కేసీఆర్ పదే పదే చెప్తూ వస్తున్నారు. భవిష్యత్ బాగా ఉంటుందని, పార్టీని వీడవద్దని వారిని బుజ్జగిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాం ఎవరికి వస్తే వారే సునాయాసంగా విజయం సాధిస్తారని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదనే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తూనే ఉన్నారు. అధినేత, ముఖ్య నేతలను కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెప్తున్న వారు వీడడం చర్చనీయాంశం అవుతోంది. బయట జరుగుతున్న చర్చ తరహాలోనే బీఆర్ఎస్ నుంచి ఇంకా కొందరు పార్టీ మారతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం : ఎమ్మెల్యే దానం - MLA DANAM FIRES ON KCR