BRS leader Padi Kaushik Reddy Slams Minister Ponnam : ఫ్లైయాష్ వ్యవహారంలో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తప్పు చేయకుంటే జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేయాలని మంగళవారం రోజున కౌశిక్ రెడ్డి మంత్రికి సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన కౌశిక్‌రెడ్డి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్ దందాను ప్రశ్నిస్తే తనకు లీగల్ నోటీసులు పంపారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల సవాల్ స్వీకరించి మంగళవారం రోజు కూడా తన స్వగ్రామంలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసిట్లు వెల్లడించారు.
మంత్రికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే పాడి : ఫ్లైయాష్ వ్యవహారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని, మరోమారు నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 11 గంటలకు ఆలయం వద్దకు చేరుకొని ప్రమాణం చేయాలని మంత్రికి సవాల్ విసిరానని కానీ ఆయన రాలేదని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆయన అవినీతికి పాల్పడ్డారని రుజువైందని కౌశిక్ రెడ్డి అన్నారు.
ఫ్లై యాష్ లారీలు ఓవర్ లోడ్‌తో వెళ్తుండటం వల్ల రహదారులు పాడైపోతున్నాయని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ అద్భుతంగా వేసిన రోడ్లన్నీ కాంగ్రెస్ సర్కార్ నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. దీని గురించి ప్రశ్నిస్తే రవాణా శాఖ మంత్రి తనకు ఏం సంబంధం అని అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బ్లాక్ బుక్‌లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాశానని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కక్కిస్తామని అన్నారు.
నా నిజాయితీని నిన్న నేను నిరూపించుకున్నాను. ఆధారాలు ఉన్నాయా అని మంత్రి అడుగుతున్నారు. కానీ, మంత్రి మాత్రం ఫ్లైయాష్ తరలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తీసుకుపోమన్న ఫ్లైయాష్‌ను డబ్బులకు అమ్ముకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పొన్నం తిన్న డబ్బులను కక్కిస్తాం. - పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
లీగల్ నోటీసులు: మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేసినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు అందాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగించారంటూ ఆయన అడ్వకేట్ పూర్ణచందర్ రావు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
మంత్రిపై నిరాధార ఆరోపణలు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు