BRS Leader Balka Suman Fires On Congress Govt : రాజకీయ ప్రేరేపిత ఉద్దేశ్యంతోనే విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దేశంలో ఈ తరహాలో ఏర్పాటు చేసిన చాలా కమిషన్లు ఏమయ్యాయో అందరికీ తెలుసునన్నారు. అప్పటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొందని, దేశంలో మంచి చరిత్ర ఉన్న బీహెచ్ఈఎల్ సంస్థకు పనులు అప్పగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్పై విద్వేషంతో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి లేరని ఎద్దేవా చేశారు. సీఎం సొంత జిల్లాలో పట్టపగలే వ్యక్తిని కొట్టి చంపారని, రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, పట్టపగలు దోపిడీలు జరుగుతున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బాల్క సుమన్ సమస్యలను ప్రభుత్వానికి చెప్పారు.
Balka Suman Comments on CM Revanth Reddy : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ ముఖ్యమంత్రి అని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు పంచి ఇచ్చారని, రాష్ట్రం నుంచి కంపెనీలు అన్ని వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో ఉన్న రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయాన్ని కూడా లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక బీఆర్ఎస్ వారిని తీసుకొని ఎంపీ టికెట్లు ఇచ్చారని, 14 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారని సుమన్ పేర్కొన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సభాపతి అనర్హత వేటు వేయాలని కోరారు. రెండు కూటముల మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో ఏ కూటమిలో లేని పార్టీలు నష్టపోయాయని తెలిపారు. బీజేపీపై మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని, బొగ్గు బావులను వేలం వేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బొగ్గు బావులను వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకు అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
"గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ ముఖ్యమంత్రి. రాజకీయ ప్రేరేపిత ఉద్దేశ్యంతోనే విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో ఉన్న రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయాన్ని కూడా లేకుండా చేస్తారా"_బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుడు