BRS Chief KCR on Party Future in Telangana : శాసనసభ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం భారత రాష్ట్ర సమితిని ఇరకాటంలోకి నెట్టింది. వరుస ఓటములతో గులాబీ నేతలు, శ్రేణులు నైరాశ్యానికి లోనయ్యారు. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడం పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో నిశ్శబ్దం అలుముకుందనే చెప్పవచ్చు. అధినేత కేసీఆర్ తనను కలిసిన నేతలు, ఉద్యమకారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.
ఉద్యమకారుల సూచనల మేర కార్యచరణ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిశితంగా గమనిస్తూ ఉండాలని నేతలకు సూచిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఆసరాగా మలచుకొని ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఆరు గ్యారంటీల అమలునే టార్గెట్ చేసుకునే అవకాశముంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేసీఆర్ త్వరలోనే చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలు, నేతలు, ఉద్యమకారుల నుంచి వస్తున్న సూచనలపై పార్టీలో చర్చించి తగిన కార్యాచరణ చేపడతారని అంటున్నారు. అందులో భాగంగా త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అందరి అభిప్రాయాలపై సమావేశంలో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించలేదు. రెండు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఇటీవల తెలిపారు. ప్లీనరీ విషయం కూడా స్పష్టతకు వస్తుందని అంటున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని గతంలో చెప్పారు. నేతలు, పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను పూర్తి సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని భావిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.