Brothers Selected in Telangana DSC From Same Family : లక్ష్యం పెట్టుకుని ఇష్టంతో చదివితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందని ఈ యువత నిరూపిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు పోటీపడి మరీ చదివి ఇటీవలే వెల్లడైన డీఎస్సీ ఫలితాల్లో మెరిశారు. డీఎస్సీకి ఎంపికైన వారు బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. కుమురంభీం జిల్లా సిర్పూర్ లోనవెల్లి గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ దానీష్ అహ్మద్‌కు ఇద్దరు కుమారులు.
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో మహమ్మద్ హుజైఫా ఎస్జీటీగా, మహమ్మద్ హమ్జా తెలుగు పండిత్‌గా కొలువులు సాధించారు. వీరు పదో తరగతి తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించినట్టు సోదరులిద్దరూ తెలిపారు. వీరి పెద్దనాన్న మన్సూర్ అహమ్మద్ కూడా రిటైర్డ్ స్కూల్ అస్టిస్టెంట్ టీచర్. అంతేకాకుండా వీరి ఇద్దరు బాబాయ్‌లు అనీష్ అహ్మద్, రయీస్ అహ్మద్‌లు సైతం స్కూల్ అసిస్టెంట్ టీచర్లు.
అప్పుడు అక్క, ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్లు : కాగజ్‌నగర్ పట్టణం ద్వారకానగర్‌కు చెందిన వ్యవసాయ దంపతులు గోలెం కళావతి, శ్రీనివాస్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సౌందర్య 2012 డీఎస్సీలో ఎంపికై ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా జాబ్ సాధించారు. మిగతా ఇద్దరు కుమార్తెలు సౌమ్య, కావ్య సైతం ఇటీవల వెల్లడైన డీఎస్సీ ఫలితాల్లో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు స్థానిక సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు టీచర్లు కావడం విశేషం. అక్కను స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఇద్దరు కూడా లక్ష్యంతో చదివి కొలువు సాధించినట్లు వారు తెలిపారు.
పాతికేళ్లలోపే టీచర్ కొలువు : ఒకే ఇంటికి చెందిన ఇద్దరు సోదరులు సైతం ఎస్జీటీలుగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌లోని దస్నాపూర్ కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీరాములు, పద్మ దంపతుల కుమారులు నర్సర్వార్ అభిషేక్, అభిలాష్‌లు. అభిషేక్ 13వ ర్యాంకుతో ఓపెన్ కేటగిరిలో కొలువు సాధించగా అభిలాష్ 72వ ర్యాంకుతో రిజర్వేషన్ కేటగిరిలో ఉద్యోగం సాధించారు. వీరి అక్క బావలు సైతం ఉపాధ్యాయులే.
50 ఏళ్లకు సర్కారీ నౌకరీ : ఓ 50 ఏళ్ల వక్తి తన కుమారుడితో కలిసి డీఎస్సీకి సన్నద్ధమయ్యారు. అంతకముందు ఆయన మూడుసార్లు డీఎస్సీ పరీక్షలు రాసినా స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం పొందే అవకాశం కోల్పోయారు. అయినా అధైర్యపడకుండా వయో పరిమితి సడలింపును అవకాశంగా మలచుకున్నారు. చివరకు 50 ఏళ్ల వయసులో, ఆఖరి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకోగా అదే డీఎస్సీలో అతని పెద్ద కుమారుడు మొదటి ప్రయత్నంలోనే కొలువు సాధించారు. తండ్రి, కుమారులిద్దరే కాదు కుటుంబం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే. ఈ స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.