Electric Bike Made By VMR polytechnic students : ప్రస్తుత సమాజంలో విద్యుత్తు వాహనాల అవసరం క్రమంగా పెరుగుతోంది. వాటి అవసరం గుర్తించిన ఈ విద్యార్థులు తమ ప్రతిభతో విద్యుత్తు ద్విచక్ర వాహనాన్ని తయారుచేశారు. వైవిధ్యంగా ఆలోచించి తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చారు. తాము చేసే పని చిన్నదైనా పెద్దదైనా పదిమందికి ఉపయోగపడాలనే సంకల్పంతో ముందుకుసాగారు. కృషి, పట్టుదల ఉంటే సాధించనిదంటూ ఏది లేదని నిరూపించారు.
వీరంతా హనుమకొండ జిల్లా రాంపూర్ వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు. ట్రిపుల్ఈ చివరి సంవత్సరం అభ్యసిస్తున్నారు. పాఠ్యపుస్తకాలలో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలని భావించారు. ఇంధన ధరల నుంచి వాహనదారులుకి విముక్తి పొందడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత పెట్రోల్ బైకును బ్యాటరీ బైకుగా తయారు చేసి ప్రయోగంలో విజయం సాధించారు.
చదువుకొనే సమయంలోనే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నారు ఈ యువత. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే అయినప్పటికీ విద్యలో రాణిస్తూనే సాంకేతిక నైపుణ్యంలో పట్టుసంపాదిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ద్విచక్ర వాహనాన్ని రూపొందించి అదరహో అనిపించారు ఈ విద్య కుసుమాలు.
కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో ఓ పాత ద్విచక్ర వాహనాన్ని సేకరించి దానిని ఎలక్ట్రికల్ బైక్‌ను రూపుదిద్దారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు అనేక రకాల ద్విచక్ర వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్న వేళ ఈ విద్యార్థులు రూపొందించిన విద్యుత్ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ బైక్‌ను 45 రోజులపాటు కష్టపడి రూపొందించామని విద్యార్థులు అంటున్నారు.
కేవలం 8 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యేలా రూపొందించారు ఈ విద్యార్థులు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చంటున్నారు.ఈ వాహనం పర్యావరణహితంతో పాటు జీరో ఇంధన వినియోగంలో భాగంగానే తయారుచేశామని చెబుతున్నారు ఈ విద్యార్థులు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విద్యుత్తు వాహనం ఎంతో ఉపయోగపడుతుందని వీటిపైన ప్రజలకు మరింత అవగాహాన రావాల్సిన అవసరం ఉందటున్నారు ఈ యువత.
రైతుగా తండ్రి కష్టం చూశాడు - సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడు
"మేము ఎలక్ట్రిక్ వెహికల్ అనే బైక్ తయారు చేసాము. నిత్యజీవితంలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఉపయోగకరం. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పర్యావరణహితంగా ఉండేవిధంగా మేము ఈ బైక్‌ను తయారు చేశాము. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్లు ఉపయోగిస్తున్నారు. మేము తయారు చేసినటువంటి బైక్ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది"-ఆదర్శ, విద్యార్థిని
విద్యార్థులలోని నైపుణ్యాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని అంటున్నారు కళాశాల అధ్యాపకులు. ఇలాంటి ఎలక్ట్రికల్ వాహనాల వల్ల పర్యావరణంలోని కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా విద్యార్థులు ఉపాధిని సృష్టించుకుంటారని అంటున్నారు. పాత పెట్రోల్ బైకును ఎలక్ట్రికల్ వాహనం చేయడం వల్ల 300 కిలోల వరకు బరువు మోయగల్గుతుందని అంటున్నారు ఈ విద్యార్థులు. ఈ వాహనాన్నిత్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
కరీంనగర్ కుర్రోడు డిజైన్ చేసిన ఈ-బైక్ చూశారా..?
విద్యుత్ వాహనాలతో ఆర్థిక భారం తగ్గిస్తున్న జగిత్యాల యువకుడు