Bharat Ratna Award to Advani : భారత రాజకీయ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఎల్.కె. అడ్వాణీ. రాజకీయ తాత్వికుడిగా అడ్వాణీ భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇంతటి మహానేతకు భారతరత్న లభించడం సంతోషంగా ఉందని నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సోషల్ వర్క్ హెచ్వోడీ నవీన్ కుమార్ అన్నారు. దేశంలో స్వతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో 1927 సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేశారని తెలిపారు. ఈ తరుణంలో నాటి భారతఖండమైన ప్రస్తుత పాకిస్తాన్ కరాచీలో 1927లో కిసాన్ చంద్ అడ్వాణీ జిజియా దేవి దంపతులకు లాలాకృష్ణ అడ్వాణీ జన్మించారు.
రథయాత్రికుడిగా అడ్వాణీ- 6యాత్రలతో దేశరాజకీయ చరిత్రలో సువర్ణాధ్యాయం!
Lk Advani Political Career : కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో అడ్వాణీ(LK Advani) పాఠశాల విద్యను ప్రారంభించారు. పాక్‍లో గల హైదరాబాద్ (సింధ్)లోని డీజీ నేషనల్ కాళాశాలలో న్యాయవిద్య అభ్యసించారు. 1947లో ఆర్ఎస్సెస్ కరాచీ విభాగ కార్యదర్శిగా అడ్వాణీ విధులు చేపట్టారు. అనంతరం దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్కు అడ్వాణీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్సెస్ పిలుపుతో దిల్లీ(Delhi)కి వెళ్లారు. 1960లో ఆర్గనైజర్ పత్రికలో అడ్వాణీ జర్నలిస్టుగా విధులు నిర్వహించారు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలో విజయం సాధించారు. 1967లో దిల్లీ మెట్రోపాలిటిన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన అడ్వాణీ, 1973-76లో జన్‍సంఘ్ అధ్యక్షుడిగానూ పని చేశారు. 1974-76లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ కీలక పాత్ర పోషించారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్టై జైలుకు వెళ్లారు. అదే సమయంలో తన జైలు జీవితాన్ని 'ది ఫ్రీజనేర్స్ స్కాఫ్' అనే పేరుతో గ్రంథాన్ని రచించారు. ఆ తర్వాత 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. జనతా పార్టీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
బీజేపీ భీష్ముడు అడ్వాణీ- హోంమంత్రి, దేశ ఉప ప్రధానిగా తనదైన ముద్ర
LK Advani Yatras : అడ్వాణీ అటల్ బిహారీ వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1990వ సంవత్సరంలో అయోధ్య రథయాత్రను ప్రారంభించారు. అయోధ్య కరసేన సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం 1997లో స్వర్ణ జయంతి రథయాత్రను ప్రారంభించారు. 1999లో బీజేపీ ప్రభుత్వ హయంలో కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అడ్వాణీ విధులు నిర్వహించారు. కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిగా అడ్వాణీ అదనపు బాధ్యతలు చేపట్టారు.
2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీ పోటీ చేసినప్పటికీ ఎన్నికల్లో(Elections) విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత 2011 అక్టోబర్లో చైతన్య యాత్రను ప్రారంభించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి, దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం. 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ గెలుపునకు ఎల్.కె.అడ్వాణీ కీలక పాత్ర వహించారు.
2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేసి అడ్వాణీ విజయం సాధించారు. 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అడ్వాణీకి భారతరత్న లభించడంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ఇలాంటి రాజకీయ పరిపక్వత చెందిన నాయకులు భవిష్యత్లో అవసరమని నల్గొండ ఎంజీ యూనివర్సిటీ సోషల్ వర్క్ హెచ్వోడీ నవీన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అడ్వాణీ లాంటి నాయకులు ఉద్భవించాలని ఆయన ఆకాంక్షించారు.
RSS ప్రచారక్ నుంచి ఉపప్రధాని వరకు- బీజేపీ ఎదుగుదలలో అడ్వాణీదే కీలకపాత్ర!