Bhadradri Ramayya Kalyanam 2024 : భద్రాచలంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి రాముడుని పెళ్లికొడుకుని చేసే వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఏప్రిల్ 17న భద్రాచలంలోని సీతారాములకు జరగనున్న కల్యాణ మహోత్సవం వేడుక సందర్భంగా ఈరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారాములకు పౌర్ణమి సందర్భంగా బేడా మండపం వద్ద విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని మంగళ వాయిద్యాల సకల రాజ లాంఛనాల నడుమ ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి రోలు రోకలికి పూజలు చేశారు. అనంతరం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ములు దంచి రామయ్యని పెళ్లి కొడుకుని చేశారు.
Srirama Navami Celebration In Bhadrachalam : అనంతరం బియ్యం, పసుపు, కుంకుమ, పన్నీరు, నెెయ్యి, బుక్కా కలిపి భక్తుల నడుమ ఆలయ అర్చకులు కల్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్. రమాదేవి పాల్గొని పసుపు కొమ్ములు దంచి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణ తలంబ్రాలను కలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తజన సందోహంతో మిదిలా ప్రాంగణం మొత్తం కిటకిటలాడింది. శ్రీరామ నామ స్మరణలతో మారుమోగిపోయింది.
భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణం టికెట్లు - Sri Rama Navami in Bhadradri
రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు : తిరుమల తిరుపతి సేవా కుటుంబం ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్యకు సేవా కుటుంబ సభ్యులు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా వడ్లను పంపించి శ్రీరామ నామ జపంతో వడ్లను వలసి గోటి కోటి తలంబ్రాలను తయారు చేసి ఈరోజు భద్రాద్రి రామయ్యకు సమర్పించారు.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ : మరోవైపు శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి తేదీని అర్చకులు ఖరారు చేశారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఏప్రిల్ 18న శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్ధీ దృష్ట్యా ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిత్య కల్యాణ వేడుకను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - శ్రీకృష్ణావతారంలో శ్రీరామచంద్రుడు