Bhadradri Ramaiah Free Darshan 2024 : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి శ్రీరామచంద్రుడి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం(Bhadrachalam Temple) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈనెల 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలో భక్తులందరికీ ప్రధాన ఆలయంలోని మూలవరులను ఉచితంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి తెలిపారు.
భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణం టికెట్లు - Sri Rama Navami in Bhadradri
ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు ఆపివేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని ఆమె తెలిపారు. దర్శనంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం నిరంతరాయంగా అన్నదాన సదుపాయం(Food Provision) కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. భక్తులంతా అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకుని, సీతారాముల కల్యాణ ఉచిత తలంబ్రాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ కోరారు.
"శ్రీరామనవమి రోజు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు వేలాదిగా కదలి రానున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలోని స్వామివారిని ఉచితంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించాం. ప్రత్యేక అర్చనలు, టిక్కెట్ వంటివి ఏమీ లేకుండా భక్తులందరికీ ఫ్రీ దర్శనం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. 17 వ తేదీ రోజు ఉదయం నుంచే అందరూ కూడా మూలవరులను దర్శనం చేసుకోవచ్చు." -ఎల్ రమాదేవి, ఆలయ కార్యనిర్వహణ అధికారి
Sri Rama Navami In Bhadradri : సీతారాముల కల్యాణం వీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో భద్రాచలంకు కదలి వస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనడం, కల్యాణోత్సవాన్ని చూడటం పూర్వజన్మ(Antecedent) సుకృతంగా భావిస్తారు. సీతారాముల కల్యాణాన్ని నేరుగా వీక్షిస్తే పాపాలన్నీ తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో భక్తులందరూ సీతారాముల కల్యాణాన్ని నేరుగా వీక్షించాలని భద్రాచలానికి అధిక సంఖ్యలో కదలి వస్తారు. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రజాప్రతినిధులు ఈ కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించకపోయినప్పటికీ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి పర్యవేక్షణలో రాములోరి మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.