Bagga Distillery Liquor in Hyderabad : రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు శంషాబాద్ ప్రాంతంలోని బగ్గా డిస్టిలరీ మద్యం సరఫరా చేస్తుంటుంది. అయితే ఈ సంస్థ తరచూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుందని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. తాజాగా 100 కార్టన్ల అక్రమ మద్యం పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖ ఆ డిస్టిలరీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆ కంపెనీ యజమాని, అక్కడ పని చేస్తున్న జనరల్ మేనేజర్, ఆయనకు సహకరించిన మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ దందా డిస్టిలరీ యజమానికి తెలిసి జరుగుతుందో? తెలియకుండా జరుగుతుందో అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తనిఖీలు నిర్వహించిన సమయంలో జనరల్ మేనేజర్ రమేశ్ ఒక్కరే దొరికినందున ఆయన చెప్పే ఏ విషయాన్ని కూడా పూర్తిగా నమ్మలేమని శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు దొరికి, వారిని కూడా విచారణ చేస్తే కానీ అక్రమ మద్యం వ్యవహారంలో వాస్తవ విషయం వెలుగులోకి రాదని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. బగ్గా డిస్టిలరీలో అక్రమ మద్యం తయారవుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో గురువారం మధ్యాహ్నం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Officers Caught 100 Cartons of Illegal Liquor : ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్టాక్ రిజిస్ట్రార్లతో పాటు అక్కడున్న మూడు నిల్వ కేంద్రాలను కూడా పరిశీలించారు. 100 కార్టన్ల చీఫ్ లిక్కర్ నకిలీ లేబుల్స్‌తో ఉన్నట్లు గుర్తించారు. నిశితంగా పరిశీలించగా పాత సీసాలలో మద్యం నింపి, వాడి పడేసిన లేబుళ్లను ఈ సీసాలకు తగిలించినట్టు పరిశీలనలో తేలినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో ఆ సంస్థ జనరల్ మేనేజర్ రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను నాలుగు రోజులు సెలవులో వెళ్లానని, తిరిగి వచ్చి చూస్తే ఈ నెల 5వ తేదీన తయారైన వంద కార్టన్ల చీఫ్ లిక్కర్ పక్కదారి పట్టినట్లు తెలుసుకుని దానిని భర్తీ చేసేందుకు అడ్డదారులు తొక్కినట్లు తెలిపారు. పాత సీసాలను ఉపయోగించి ఎప్పుడో వాడేసిన లేబుళ్లను వాడి పక్కదారి పట్టించిన లిక్కర్ స్థానంలో నింపేందుకు యత్నించినట్లు తెలిపారు.
రూ.1.83 కోట్ల విలువైన అక్రమంగా తరలిస్తున్న మద్యం ధ్వంసం - police destroyed illegal liquor
illegal liquor at Shamshabad : అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న కేసులో బగ్గా డిస్టిలరీ జనరల్ మేనేజర్ రమేశ్, డిస్టిలరీ యజమాని జస్మిత్ సింగ్ బగ్గా, ప్రొడక్షన్ ఇంఛార్జి పాశం లింగారెడ్డి, లోడింగ్ ఇంఛార్జి మామిడాల అశోక్, లోడింగ్ పాయింట్ ఇంఛార్జి వెంకటేశ్‌లతో పాటు డిస్టిలరీపైన కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. గతంలో ఒక్కసారి స్పిరిట్ దొరికినప్పుడు, మరొకసారి కల్తీ మద్యం దొరికినప్పుడు పర్యవేక్షణ లోపం ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించి ఇద్దరు సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు సీఐలపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ డిస్టిలరీలో పర్యవేక్షణ విధులకు వెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు ముందుకు రావడం లేదు. అయినా కూడా అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించక తప్పకపోవడంతో వెళ్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్రమ మద్యం దొరికినప్పుడు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్న ఎక్సైజ్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
దందా వెనుక ప్రమేయం ఎవరిది : బగ్గా డిస్టిలరీలో తయారైన వంద కార్టన్లు మద్యం డిపోలకు కాకుండా బయటకు వెళ్లినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యాన్ని భర్తీ చేసే క్రమంలోనే ఈ నకిలీ లేబుల్‌తో ఉన్న మద్యం దొరికిందని చెబుతున్న అధికారులు లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ దందా వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై విచారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ డిస్టిలరీ అక్రమ మద్యాన్ని ఎంత తయారుచేసింది. బయటకు ఎంత సరఫరా చేశారు. ఎవరికి సరఫరా చేసి దీనిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తదితర వివరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
అధికారులపై కఠిన చర్యలు : ప్రతి డిస్టలరీలో మద్యం తయారు చేసే ముందు అక్కడ ఆ డిస్టిలరీకి కేటాయించిన ఎక్సైజ్ అధికారులు మద్యం తయారీకి చెందిన ముడి సరుకు, ఇతర సాంకేతికపరమైన అంశాలను నిర్ధారించిన తర్వాతనే మద్యం తయారు చేయాల్సి ఉంటుంది. బగ్గా డిస్టిలరీ అక్రమ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో అక్కడ డిస్టిలరీ పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ అధికారులపై కూడా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.