Money Fraud By Bihar Gang in Nalgonda : ప్రజలకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశచూపి డబ్బు కాజేస్తున్నారు. ఉన్న నగదును రెట్టింపు చేస్తామని మాయ మాటలు చెప్పి మెుదట కొద్దిపాటి నగదును రెట్టింపు చేసి చూపిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు మారుస్తామంటారు. భారీ నగదు చేతికి రాగానే ఆ డబ్బులతో పరారీ అవుతున్నారు. ఈ తరహాలో నగదును రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న బిహార్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది : నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రామోజు రామాచారి రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించాడు. ఆ సమయంలో బిహార్‌కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపీ మేస్త్రితో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని నమ్మించాడు. ఈనెల 22న బిహార్‌కు చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి నరేశ్, బాధితుడు ఇంటికి వెళ్లారు.
డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి : నగదు రెట్టింపు చేస్తామని చెప్పగా రామాచారి తన వద్ద ఉన్న 33 లక్షల రూపాయలను ఇచ్చాడు. వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్‌ని ఒక బకెట్లో పోసి నగదును ముంచి బయటకు తీసి వాటికి తెలుపు, బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు కట్టారు. ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు.
ఆ లోపు రోగులు ఎవరో వచ్చారని రామాచారి బయటకు వెళ్లి చూసి వచ్చేసరికి రూ.33 లక్షలతో పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత నగదు చూస్తే పైన కింద రూ.500 నోట్లు మధ్యలో తెల్లని పేపర్లు ఉన్నట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నల్గొండ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 24 లక్షల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Money Double Fraud in Hyderabad : డబ్బులు డబుల్ చేసిస్తా.. నమ్మితే ఇలాగే అవుతది మరి..!
Online Fraud: లిక్విడ్ ఆయిల్ పేరుతో ఆన్లైన్లో రూ.1.72 కోట్లు స్వాహా