Liquor Shops Applications in Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం మద్యంపై నూతన పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో వైన్ షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం(అక్టోబరు 11)తో మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు తేదీ ముగిసింది. దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని, రూ.1,800 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
శుక్రవారం సాయంత్రం ఏడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ సమయానికి 87,986 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ రాత్రి 11 గంటలకు 89,643కు పెరిగింది. ఇంకా ఆసమయం దాటినా సరే చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉన్నారు. మరికొంత మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేలు దాటే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.1800 కోట్ల పైనే ఖజానాకు ఆదాయం రానుందని అంచనా. వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయంట.
ఏపీలో నూతన మద్యం పాలసీ : ఏపీలో 2017లో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. అప్పట్లో 4,380 దుకాణాలకు 76 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో దుకాణానికి 17 నుంచి 18 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో ఎక్సైజ్ శాఖకు అప్పట్లో రూ.474 కోట్లు ఆదాయం వచ్చింది. కానీ ఈసారి 3,396 దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా సుమారు 90 వేలకుపైనే దరఖాస్తులు వచ్చాయి.
ఆ దుకాణానికి అత్యధిక దరఖాస్తులు : ఏపీలో సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు రాగా, అందులో ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మద్యం దుకాణాలకు ఎక్కువ పోటీ ఉంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని 96 నంబరు దుకాణానికి 132, 97 దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మూడు ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోనే ఉన్న దుకాణాలు కావడం విశేషం. ఏపీలో అక్టోబరు 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది.
వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!
దసరా వేళ మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజుల పాటు వైన్స్ బంద్