AP Voters Election Journey Difficulties : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు చేరుకునేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పెంచిన రేట్లు పెనుభారంగా మారుతున్న తరుణంలో, ఆర్టీసీలో బస్సుల్లో వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి వెళ్లేందుకు పలుచోట్ల బస్టాండ్‌ల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. కానీ తెలంగాణ ఆర్టీసీ కూడా రేట్లు పెంచడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ సమయంలో సామాన్య ప్రజలు 400 రూపాయలు పెట్టి కొనుక్కున్న టికెట్ ప్రస్తుతం రెట్టింపు ధరకు కొనాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఆ టికెట్ కూడా నాలుగు, ఐదు రోజుల ముందు బుక్ చేసుకుంటే గాని దొరకని పరిస్థితని, ఇప్పుడు హడావుడిగా వెళ్దామని బస్టాండ్‌కు వస్తే ఒక్కరికి విజయవాడకు రూ.2000 పైన డబ్బులు అడుగుతున్నారని పలువురు ఆంధ్రా ఓటర్లు వాపోతున్నారు.
"మేము ఓటు వేసేందుకు విజయవాడ వెళ్లాలి. ఉదయం నుంచి బస్సులు కోసం వేచివున్నా, ఒక్క బస్సు సమయానికి రావటం లేదు. అలా అని కారు ఎక్కి వెళ్దామంటే ఛార్జీ ఎక్కువ అడుగుతున్నారు. సరైన ప్రయాణ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ బస్సులు వస్తున్నా ఖాళీ లేవు. ఊరు ఎలా వెళ్లాలో కూడా తెలియని అనిశ్చితి ఏర్పడింది."-ప్రయాణికులు
RTC Price Hike in Election Time : అలానే కూకట్పల్లి నుంచి గుడివాడకు ఆర్టీసీలో నాలుగు వందలు ఉన్న టికెట్టు నాలుగు రోజుల క్రితం బుక్ చేసుకున్నా వెయ్యి తీసుకున్నారని మరికొందరు తెలిపారు. ధరలు తగ్గించి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తే సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లు వేసి వస్తామని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉన్న ఏపీ ఓటర్లు తమ సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే రైళ్లు, బస్సులు బుక్ చేసుకున్నప్పటికీ, తగినన్ని లేవని ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా పలువురు ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. రైళ్లు, బస్సులు, ప్రత్యేక సర్వీసులను నడపాలని ఆంధ్ర ప్రయాణికులు కోరుతున్నారు.
"ఓటు వేసేందుకు నేను ముంబయి నుంచి వస్తున్నా, హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్లటానికి మాత్రం బస్సు సదుపాయం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటకే నాలుగు గంటలు ముగుస్తున్నా ఒక్క బస్సు కూడా రాలేదు. ట్రావెల్ సదుపాయం కల్పించి అందరూ ఓటు వినియోగించేలా ప్రభుత్వాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. హైదరబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు సాధారణ సమయంలో రూ.400 టిక్కెట్ ఉండేది. ఇప్పుడు అదే టిక్కెట్ రూ.1000 చెల్లించి తీసుకున్నాం. అడ్వాన్స్ బుకింగ్ కాకుంటే రూ.1500 సైతం వసూలు చేస్తున్నారు."-ప్రయాణికులు
మందు బాబులకు డబుల్ షాక్ - ఈ సారి వరుసగా 2 రోజులు వైన్స్ బంద్! - WINE SHOPS CLOSE IN TELANGANA