ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే - సుప్రీంకోర్టుకు పర్యావరణ, అటవీ శాఖ నివేదిక - Supreme Court report illegal mining - SUPREME COURT REPORT ILLEGAL MINING
Illegal Sand Mining in AP : రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు సాగడంలేదని, నిబంధనల ఉల్లంఘనలు జరగడంలేదని తప్పుడు నివేదికలతో సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించాలని జగన్ సర్కారు ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మాత్రం అక్రమ తవ్వకాలు నిజమేనని మరోసారి ఖరారు చేసింది


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 9:01 AM IST
Environment and Forest Department Report to Supreme Court on Illegal Sand Mining in AP : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ సుప్రీంకోర్టుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని పేర్కొంది. క్షేత్రస్థాయిలో పర్యటనలో ఇసుక దోపిడీని గుర్తించిన కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ కమిటీ అన్ని విషయాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
Illegal Mining of Sand in AP : ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. జీసీకేసీ (GCKC) ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలు ముందస్తు అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం శాండ్ రీచ్, స్టాక్‌యార్డ్, లంకపల్లి, రొయ్యూరు, చోడవరం, మున్నలూరు రీచ్‌లలో పర్యటించినట్లు కేంద్ర పర్యావణ, అటవీ శాఖ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొత్తపల్లి, చింతపల్లి రీచ్, స్టాక్‌యార్డ్, కోగంటివారిపాలెం, మల్లాడి, పొందుగల, వైకుంఠపురం రీచ్‌ల పరిశీలనలో గుర్తించిన అంశాలనూ నివేదికలో ప్రస్తావించింది.
శ్రీకాకుళం శాండ్ రీచ్‌లో జేసీకేసీ (JCKC) సంస్థ ఇసుక తవ్వుతోందని, అక్కడ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేవని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ సుప్రీకోర్టుకు ఇచ్చిన నివేదిక తెలిపింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం జేసీకేసీ (JCKC) సంస్థకు గనులు, భూగర్భశాఖ నుంచి ముందస్తు అనుమతులేమీ లేవని నివేదికలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ ప్రాధికార సంస్థ నుంచి గానీ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి గానీ అనుమతులు లేవని వివరించింది. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినప్పుడు 5 పొక్లెయిన్లతో తవ్వి, ట్రక్కుల ద్వారా తరలిస్తున్నారని పేర్కొంది. దాదాపు కిలోమీటర్ పరిధిలో 4, 5 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారని నదుల నీటి మట్టానికి మించి ఇసుక తవ్వేస్తున్నారని నివేదికలో తెలిపింది.
ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel Mining
రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు సాగడం లేదని, నిబంధనల ఉల్లంఘనలు జరగడంలేదని తప్పుడు నివేదికలతో సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టాలని జగన్ ప్రభుత్వం, గనులశాఖ ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం అక్రమ తవ్వకాలు నిజమేనని మరోసారి ఖరారు చేసింది. సుప్రీంకోర్టుకు గురువారం అందజేసిన నివేదికలో ఈ విషయం కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అన్ని రీచ్‌ల్లో పరిశీలించి జులై 2 నాటికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడా అక్రమ తవ్వకాల్లేవని గతంలో ఓసారి ఎన్జీటీకి కలెక్టర్లంతా ఒకేలా నివేదిక ఇచ్చి నవ్వులపాలయ్యారు. రీచ్‌లను మొక్కుబడిగా తనిఖీ చేసి అప్పట్లో నివేదిక ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నివేదిక కోరడంతో కలెక్టర్లు నిజాలను వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మూడేళ్లుగా వైఎస్సార్సీపీ పెద్దలు సాగించిన భారీ ఇసుక దోపిడీ వ్యవహారం మున్ముందు పలు జిల్లాల కలెక్టర్లు, గనులశాఖ అధికారుల మెడకు చుట్టుకోనుందనేది స్పష్టమవుతోంది.
ఈ చెరువు నాది- నీవు తవ్వుకోవడానికి వీల్లేదు! మట్టి అక్రమ తవ్వకాల్లో అధికార నేతల మధ్య బాహాబాహీలు