AP Government Not Deposited NPS Funds: ఎన్‌పీఎస్(New Pension Scheme) వాటా నిధుల్ని 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన సాధారణ ఉద్యోగుల్లోనే కాదు, ఐఏఎస్ అధికారులలోనూ మొదలైంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వారంతా వాపోతున్నారు. దీనిపై అంతర్గత గ్రూప్ డిస్కషన్స్‌లో దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. అయితే దీనిపై బహిరంగంగా ఏ అధికారి కూడా మాట్లాడటం లేదు.
సంఘ సమావేశాల్లో చర్చలకు సైతం భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సోమవారం జరిగే ఐఏఎస్ అధికారుల సంఘ సమావేశంలో దీన్ని ఎజెండాగా చేర్చి చర్చించాలనే సూచనలు కొందరు అధికారుల నుంచి వచ్చాయి. అయితే మరికొంత మంది అధికారులు దీన్ని బహిరంగ చర్చకు పెట్టొద్దని వారించారు. టేబుల్ ఎజెండాగా చర్చిద్దామని, ఇలాంటి సున్నితమైన విషయాలను ఎజెండాలో పెట్టకుండా ఉండటమే మంచిదని వారు సూచించినట్లు తెలుస్తోంది.
అప్పుడు కూడా ఎన్‌పీఎస్ నిధులపై పెద్దగా చర్చలు జరపకుండా, ఎక్కువ ప్రచారం లేకుండా ముగించాలని చెప్పడం గమనార్హం. దీనిపై పత్రికల్లో వార్తలకు సైతం తావీయకుండానే పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (Chief Secretary) నివేదించాలని సూచించినట్లు సమాచారం.
అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు - ఆర్బీకే ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
సీపీఎస్‌పై మడమ తిప్పి: 2004 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సీపీఎస్ (Contributory Pension Scheme) వర్తిస్తుంది. అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీఎం అయ్యాక మడమ తిప్పేశారు. ఓపీఎస్ (Old Pension Scheme) అమలు చేస్తే వారికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయే పరిస్థితి లేదని చెబుతూ ద్రోహం చేశారు. అనంతరం ఓపీఎస్ అమలు చేస్తామంటూ చెప్పి జీపీఎస్ (Guaranteed Pension Scheme) తీసుకొచ్చారు.
కొత్త పెన్షన్ పథకం సైతం సరిగ్గా అమలు చేయడం లేదు. 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయడం లేదని ఐఏఎస్ అధికారులే చర్చించుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి తన వాటాగా పది నెలలు చెల్లిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి జమ చేయాలి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగి పది నెలల వాటానే ఇద్దరి వాటాగా చూపిస్తూ కేవలం 5 నెలలకు మాత్రమే జమ చేస్తోంది. ఎన్‌పీఎస్ పథకం కింద ఉద్యోగి, ప్రభుత్వ వాటా కలిపి ఏడాదికి 4 వేల 200 కోట్లు అవుతుందని రాష్ట్ర సర్కారే ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే ఈ మొత్తంపై వచ్చే ప్రయోజనాలు సైతం ఉద్యోగులకు అందడం లేదని స్పష్టం అవుతోంది.
ఏపీఎండీసీ నిధులపై జగన్ సర్కార్ కన్ను - 700 కోట్లు పక్కదారి పట్టించేందుకు సన్నద్ధం