Big Shock to YSRCP Social Media Fake Spreaders : ఉచ్ఛనీచాలు మరిచిపోయి అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలతో దాడి చేస్తున్న ఉన్మాద మూకలు మరణ శిక్షకు సిద్ధం అవ్వాల్సిందే. జీవిత ఖైదు అనుభవించాల్సిందే. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది వాస్తవం.
ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు : ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఈ సంవత్సరం జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్-111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు, చట్టాలు ఏమీ చేయలేవని, మహా అయితే అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని, అంతకు మించి ఏమీ కాదంటూ రోజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ ఉగ్రవాదులపై ఈ చట్ట ప్రకారమే ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత సహా ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్న పిల్లలు, జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్సీపీని ప్రశ్నించేవారు, విమర్శించే వారే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సాగిస్తున్న అసభ్య, బూతుల దాడి వ్యవస్థీకృతంగా కొనసాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతున్న ఈ నేరంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే.
వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత
ఒకసారి కేసు నమోదైతే జైలు జీవితమే : వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించుకుని వారితో వాట్సప్, ఎక్స్ ఖాతాలు, ఫేస్‌బుక్ గ్రూపులు సృష్టించింది. తమ రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా అసభ్య, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాల్ని పెద్ద ఎత్తున తయారు చేయింస్తూ వాటిల్లో పోస్టు చేయిస్తూ వైరల్ చేస్తోంది. హేయమైన, పత్రికల్లో రాయటానికి వీలులేని బూతులతో కామెంట్లు పెట్టిస్తోంది.
ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల్ని నిరంతరంగా ఒక వ్యవస్థ రూపంలో కొనసాగిస్తోంది. అందుకే దీనిలో భాగస్వాములుగా ఉన్న వారందరూ చట్ట ప్రకారం 'ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్' (Organized Crime Syndicate) లో సభ్యులే. ఇలాంటి వారు 50 వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపైనా, కొత్తగా ఈ సిండికేట్‌లో చేరిన వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద ఒకసారి కేసు నమోదు అయితే జైలుకు వెళ్లాల్సిందే.
మరణ శిక్ష, జీవిత ఖైదు : సోషల్ మీడియాలో వ్యవస్థీకృతంగా అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, కామెంట్లు పెట్టటం వంటివి కొనసాగించటం వల్ల బాధితుల మృతికి కారణమైన వారికి బీఎన్‌ఎస్ సెక్షన్ 111 (2)(ఏ) ప్రకారం మరణ శిక్ష విధిస్తారు. లేదా జీవిత ఖైదు వేస్తారు. వీటికి అదనంగా రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. చావుకు కారణం కాకపోయినా సరే ఈ నేరానికి పాల్పడితే బీఎన్‌ఎస్ సెక్షన్ 111 (2)(బీ) ప్రకారం కనిష్ఠంగా ఐదు సంవత్సరాలు, గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు. రాష్ట్ర స్థాయి నుంచో, జిల్లా స్థాయి నుంచో పంపించారని అసభ్య పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.
దొరకరు అనుకుంటే అది మీ భ్రమ : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా సాగిస్తున్న ఈ దాడిలో చాలా మంది తెలిసో, తెలియకో భాగస్వాములు అవుతున్నారు. వారి నిజమైన పేరు, ఫొటో పెట్టుకోకుండా ఏవేవో పేర్లతో పదుల సంఖ్యలో ఖాతాలు సృష్టించి వాటి నుంచి అసభ్య పోస్టులు పెడుతున్నారు. దీంతో తమ ఉనికిని ఎవరూ గుర్తించలేరని, పట్టుకోలేరనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారు ఎక్కడి నుంచి పోస్టులు పెట్టినా తప్పించుకోవటం అసాధ్యం.
వారి డిజిటల్ ఫుట్ ప్రింట్స్, ఐపీ అడ్రస్‌ల ద్వారా వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు ఇంత చొప్పున పేటీఎంల్లో చెల్లిస్తున్నారనో, తమ అభిమాన నాయకుడి కోసమనో అసభ్యంగా పోస్టులు పెడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒక్కసారి కేసు నమోదైతే ఉద్యోగాలు ఇవ్వటానికి ఎవరూ ముందుకు రారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఉద్యోగాల కోసం వెళ్లాలన్నా పాస్‌పోర్టులు, వీసాలు లభించవు. వీటన్నింటికీ మించి ఈ కేసుల్లో సులువుగా నేర నిరూపణ అవుతుంది. అది జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే.
"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం
సహకరించిన నేరమే : సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించటం, సహకరించటం, ప్రయత్నించటం, కుట్ర చేయటం, అది నేరమని తెలిసి మరీ ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడేందుకు తగిన సదుపాయాలు కల్పించటం, దీని సన్నద్ధతలో భాగస్వాములవ్వటం బీఎన్‌ఎస్ సెక్షన్ 111 (3) ప్రకారం తీవ్ర నేరం. దీనికి కనిష్ఠంగా ఐదేళ్లు గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. 5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు.
వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమాల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు, వారు నిర్వహించే గ్రూపుల్లో ఉన్న వారు, ఆ అసభ్య పోస్టులను షేర్ చేస్తున్న వారు, రీ పోస్టులు చేస్తున్న వారు, వాటికి తోడ్పాటు అందిస్తున్న వారిని ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్‌లో సభ్యులుగా చట్టం పరిగణిస్తుంది. వీరికి కనిష్ఠంగా ఐదేళ్లు గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా వేస్తారు. అసభ్య పోస్టులతో దాడి చేస్తున్న ఉన్మాదుల్ని పోలీసులకు చిక్కకుండా దాచి పెట్టినా, రక్షించినా బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 111 (5) ప్రకారం తీవ్ర నేరం. దీనికి కనీసం మూడు సంవత్సరాలు, గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా వేస్తారు. ఈ ఉన్మాదుల్లో కొందరికి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలే రక్షణ కల్పిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారినీ ఈ చట్టం మేరకు శిక్షించొచ్చు.
సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల