Crop Fields Destroyed by Heavy Rains in AP : ఏపీలోని కృష్ణానదికి పోటెత్తిన వరదలకు తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లోని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లంకల్లో కంద, అరటి, మొక్కజొన్న, పసుపు, కూరగాయల తోటలు నీట మునిగాయి. భారీ వర్షానికి పెనుగంచిప్రోలు మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో పెనుగంచిప్రోలు నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణలో కురిసిన భారీ వర్షానికి మున్నేరులో వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. మైలవరం పరిధిలోని ఎర్రచెరువు కట్ట ప్రమాదకరస్థితికి చేరింది. ఫలితంగా అధికారులు చెరువు కట్ట తెగ్గొట్టి నీటిని పోరగుట్టవైపు మళ్లించారు. గణపవరంలోని తూర్పు చెరువుకు గండి పడి వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. భారీ వర్షాలకు గుంటూరు జిల్లా లంకల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. వందల ఎకరాల పసుపు, అరటి, మినుము, బొప్పాయి చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
"బొప్పాయి రెండెకాలు వేశాను. ఎకరానికి రూ.లక్ష ఖర్చు పెట్టాను. తోట తెగుతుందనుకున్న సమయానికి ఏరు పొంగి అంతా నీట మునిగింది. చెట్లు ఇక బతకవు. రెండున్నర ఎకరాల అరటి తోట సాగు చేశాను. గెలలు కాసి చేతికందే సమయంలో కృష్ణానది ఉప్పొంగి, పంటంతా వరద ఉద్ధృతిలో ధ్వంసమైంది. దీంతో చాలా వరకు నష్టపోయాం. ప్రభుత్వం సత్వరమే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అది సబ్సిడీ రూపేణా లేదా తరువాత పంటకోసం విత్తనాలు సరఫరా చేసైనా మాకు సాయం చేయాలి." -రైతులు
రహదారుల శాశ్వత మరమ్మతులకు రూ.212 కోట్లు అవసరం : చేబ్రోలు మండలంలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రహదారులు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 35 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు కోటీ 40 లక్షల రూపాయలు, శాశ్వత మరమ్మతులకు రూ.212 కోట్ల 70 లక్షలు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.