Committee On Atchutapuram Explosion Case : అచ్యుతాపురం ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇండస్ట్రీలలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిబంధనల మేరకు ఎస్ఓపీ అనుసరించలేదని తెలుస్తోందని చెప్పారు. పరిశ్రమలో ఏం జరిగింది? అనే విషయంతో పాటు లోపాలపై కమిటీ విచారిస్తుందని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక తప్పు ఎవరు చేసినప్పటికీ వదిలిపెట్టమని ఆయన వివరించారు.
గత ఐదేళ్లలో 119 ఘటనలు : గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారన్న చంద్రబాబు పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతాప్రమాణాలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో శక్తి వంతమైన పేలుడు జరిగిందని అన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా పరిశ్రమను పరిశీలించిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పరిశ్రమలో కలియతిరిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన విశాఖ ఆసుపత్రుల్లో ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చానని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలను సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.
"ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నా. పరిశ్రమలో ఏం జరిగింది అనే విషయంతో పాటు లోపాలపై కమిటీ విచారిస్తుంది. వాటికి ఉన్న ఇబ్బందులపైనా పరిశీలిస్తుంది. పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు" - చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి
రెడ్ క్యాటగిరీలో ఉన్న పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆయా ఇండస్ట్రీలు వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలి. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు.