AP CM decision On MLA MPS recommendation letters In Tirumala : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, రెండు 300 రూపాయల దర్శనానికి సంబంధించిన లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువై ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70,000 పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. రూ.300 రూపాయల స్పెషల్ ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 40 వేల టికెట్ల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా టికెట్లను జారీ చేయడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లను ఇప్పటికే అధికారులు ఆన్లైన్లో విడుదల చేశారు. 10 రోజుల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్లను ఆన్లైన్లో విధానంలో జారీ చేస్తారు. 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది సెంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.