AP CM Chandrababu Spoke on Jamili Elections : జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద అరిష్ఠం జగన్ అని ధ్వజమెత్తారు. విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.75 వేల కోట్లలతో రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని వివరించారు. బెంగళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ నగరాలను కలిపేలా బుల్లెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు అభినందించటం తన బాధ్యతనని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రణాళికలు వేయడమే కాదు, సరిగా అమలు చేస్తేనే మంచి ఫలితాలు : దేశంలో 7 శాతం వృద్ధి రేటు ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలను తెస్తున్నారు. పీఎం సూర్య ఘర్ ద్వారా ఇంటింటికీ సౌరశక్తి వెలుగులు తెస్తున్నారు. కొందరు వ్యక్తులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వనరులు సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు సాధ్యం. ప్రణాళికలు వేయడమే కాదు, సరిగా అమలు చేస్తేనే మంచి ఫలితాలు. 2047 నాటికి మనదేశం అన్నింట్లో అగ్రగామిగా ఉండాలి. అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
విధ్వంసకర పాలన వల్ల ఏపీ ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లుగా చూశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హరియాణాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని, సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం పని చేసే విధానం వల్ల హరియాణాలో గెలిచారని పేర్కొన్నారు. హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభ సూచిక అని వివరించారు. మోదీ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారని, సుస్థిరత, అభివృద్ధికి హరియాణా ప్రజలు ఓటేశారని చంద్రబాబు వెల్లడించారు.
JK, హరియాణా రిజల్ట్స్‌తో బీజేపీలో ఫుల్ జోష్- నెక్స్ట్ టార్గెట్ మహారాష్ట్ర, ఝార్ఖండ్!