Problem in Medigadda Barrage 7th Block : మేడిగడ్డ బ్యారేజీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వం ఓ వైపు బ్యారేజీ మరమతు పనులను చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోమారు ప్రాజెక్టులోని 7వ బ్లాకులో సమస్యలు ఉత్పన్నమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమై హుటాహుటిన ప్రాజెక్ట్‌ను సందర్శించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏం జరిగిందంటే?
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ 7వ బ్లాకులో మళ్లీ ఓ సమస్య ఉత్పన్నమైనట్లు బుధవారం ప్రచారం జరిగింది. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టగా, ఆ ప్రాంతంలోనే సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులు రాత్రిపూట హుటాహుటిన బ్యారేజీకి చేరుకుని పరిశీలించారు. రాత్రి కావడంతో ఎక్కడ ఏం జరిగిందో తమ దృష్టికి రాలేదని వారు చెబుతున్నారు.
తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు వీలుగా 7వ బ్లాక్ పరిధిలో గోదావరిలో నిర్మించిన రింగ్ బండ్ తొలగింపు పనులను విద్యుత్తు దీపాల వెలుతురులో చేపట్టారు. అర్ధరాత్రి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యారేజీకి సమస్య ఏర్పడినట్లు ప్రచారం జరగడం, రింగ్ బండ్ తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన చేస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డిని ఫోన్లో సంప్రదించగా బ్యారేజీ వద్ద సమస్యలు ప్రస్తుతానికి గుర్తించ లేదని, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇప్పటికే కేంద్ర బృందాలు పరిశీలన : మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో దిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలు చేసింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించారు. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగానే తాత్కాలిక, శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని పరీక్షలను అక్కడికక్కడే చేయగా, మరికొన్ని నమూనాలను సేకరించారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో 25 అడుగుల మేర డ్రిల్లింగ్ చేసి అందులో నమూనాలను సేకరించింది. అలాగే పియర్స్‌కు డ్రిల్ చేసి కూడా పరీక్షించారు. జియో టెక్నికల్, కాంక్రీట్ పరీక్షలు, జియో ఫిజికల్ పరీక్షలను సైతం నిర్వహించింది.