Minister Nara Lokesh responds on Red Book : తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్‌బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే, విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి మరీ ప్రచారం కల్పించారని ఆయన పేర్కొన్నారు.
గౌరవంగా చూసుకుంటాం.. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 మీడియా సమావేశాలు పెడితే, ఈఎన్నికల్లో 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్‌మీట్‌లు పెట్టారని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే, వాస్తవాలను తాము వివరిస్తామని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుంటామని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతల వలే, కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని ఆయన తెలిపారు.
ఇవాళ అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేశ్‌కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆయనని కలిసి తమ తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Srikalahasti MLA Bojjala Sudhir Reddy : లోకేశ్ దగ్గర ఉన్న రెడ్‌బుక్‌లో మొదటి పేరు జగన్‌దేనని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రెడ్‌బుక్ గురించి జగన్ దిల్లీలో కూడా చెప్పటం హాస్యాస్పదమని ఆయన తెలిపారు. మదనపల్లిలో ఫైల్స్ తగలపెట్టిన కేసులో నిందితులను ఎవరినీ వదలమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.
జగన్ అసెంబ్లీకి రావాలి : జగన్ అసెంబ్లీకి రాకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో క్రైం క్యాపిటల్, గంజాయి క్యాపిటల్‌గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. జగన్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి అన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు.