Andhra Vehicles Allowed to Enter Telangana : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు తెలంగాణలోకి అనుమతించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కోతకు గురికావడంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండో వంతెన ద్వారా వాహనాలను అనుమతిస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు.
విజయవాడకు వెళ్లేందుకు నిలిచిపోయిన వాహనాలను కూడా పంపిస్తామని పేర్కొన్నారు. కాగా గత మూడు రోజులపాటు కురిసిన వానలకు సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద భారీగా సరకు లారీలు నిలిచిపోయాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల పరిధిమేర ఆగిపోయాయి. మరోమార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా పడిగాపులుకాయగా, ఎట్టకేలకు ఇవాళ మార్గం సుగమమైంది. అంతకముందు కోదాడకు చేరుకున్న వెహికల్స్‌ను పోలీసులు మిర్యాలగూడ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నించారు.
Minister Uttam Visit to Rain Affected Areas : సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి పడగా మంత్రి పరిశీంచారు. వారం రోజుల్లో గండి పూడ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతిని పరిశీలించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలించిన ఉత్తమ్, ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాలు కారణంగా రాష్ట్ర అతలాకుతులం కావడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంతో చర్చించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామన్నారు. హైడ్రా తరహాలో చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పోలీసులు సూచనలు : తెలుగు రాష్ట్రాల్లో వరదల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. చిల్లకల్లు, నందిగామలో జాతీయ రహదారి 65పై వరద, ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ వద్ద బ్రిడ్జి కూలిపోయిన ఘటన, సూర్యాపేట ఖమ్మం రహదారిపై పాలేరు పొంగటం వంటి ఘటనల దృష్ట్యా నగర ప్రజలు జర్నీలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఎమెర్జెన్సీ పరిస్థితిల్లో వెళ్లాలనుకుంటే విజయవాడ వెళ్లేవారు చౌటుప్పల్, నార్కెట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.
భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు - Bridge washed away by rains in tg