AP Home Minister Anitha on Rape Incident : ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యా కోడళ్లపై అత్యాచారం ఘటనలో 48 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిందితులకు వేగంగా శిక్షపడాలని కేసును స్పెషల్ కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెప్పారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ద్వారా నిఘూ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వంగలపూడి అనిత వెల్లడించారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కోరుతున్నట్లుగా వివరించారు. వారి ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ చేయడం సాధ్యమవుతుందని వివరించారు. పోలీసులకు ఆయుధాల్లాగే, ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని ఉపయోగించి నేరాల నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం : సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హోం మంత్రి చెప్పారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో చాలా వేగంగా విచారణ కోసం కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించామన్నారు. దొరికిన 5 మంది నిందితుల్లో ఒకరిపై అత్యాచార ఆరోపణలు సహా 37 కేసులు ఉన్నాయని హోంమంత్రి అనిత చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఉపేక్షించేదే లేదని తేల్చిచెప్పారు.
నేరాలు జరగకుండా ముందే మేల్కోవాలి : నేరాల నియంత్రణనే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు. నేరాలు ఎక్కడ జరిగినా ముందే మేలుకోవాలని వంగలపూడి అనిత సూచించారు. ప్రజలంతా సీసీ కెమెరాలను విరివిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవి లేనిచోట డ్రోన్స్ వినియోగించాలన్నారు. డ్రోన్స్ లేకపోతే సెల్ఫోన్లు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా వీడియో తీస్తున్నారని, ఇలాంటి వార్తలు మాకు ఇచ్చేట్లయితే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హోం మంత్రి హామీ ఇచ్చారు. నేరాలు జరగకుండా ముందే మేలుకోవాలన్నారు. ఒకవేళ నేరం జరిగినట్లయితే నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.